● పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆటోవాలాల ఆందోళన
● విజయనగరంలో భారీ ర్యాలీ
విజయనగరం గంటస్తంభం: పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్‌టీయూ (న్యూ) అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేశారు. ధరల పెంపునకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మయూరి కూడలి మీదుగా మెసానిక్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ ప్రధాన ద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు, కార్యదర్మి ఎన్.అప్పలరాజు మాట్లాడు తూ, ఇంధన ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపకుండా ఇంధన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెన్నా ధర్మారావు, గేదెల నారాయణరావు, కంది రాము, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


