బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

కాంగ్రెస్‌ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి మువ్వల

బొబ్బిలి: గడచిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు బేబీనాయన ఇచ్చిన అఫిడవిట్‌లో పొందుపరిచిన భూములకు, ప్రస్తుతం ఆయన తనవి అంటున్న భూములకు తేడాఉందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి మువ్వల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. బేబీనాయన ఈసీకి ఇచ్చిన భూముల వివరాలతో సంబంధం లేని గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 619/2బి, 621/2బిలోగల భూ హక్కులు తనవిగా చూపిస్తూ మల్లంపేటకు చెందిన ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేయించారన్నారు. ఆ భూములు తనకు ఏ విధంగా దఖలు పడ్డాయో ఈసీకి బేబీనాయన వివరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఏడుగురు రైతుల భూములను ఆక్రమించుకుని పోలీసు కేసు పెట్టి ప్లాట్లుగా వేసి విక్రయించుకుంటున్నారన్నారు. ఆ భూములపై నుంచి విద్యుత్‌ వైర్లు వేసినందుకు బెర్రీ కంపెనీ రైతులకు పరిహారం ఇచ్చిందనీ, వారికి రైతు భరోసా నిధులు కూడా వచ్చాయన్నారు. సమావేశంలో వేణు, తదితర రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement