● ఎండ వేడిమికి తగ్గిన
పాల దిగుబడి
● పశువులను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న పాడి రైతులు
విజయనగరం ఫోర్ట్: భానుడి ప్రతాపానికి మానవులతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలను ఎన్నడూ దాటలేదు. అలాంటిది ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైబడే నమోదవుతోంది. దీనికి తోడు వడగాల్పులు తోడవ్వడంతో జనంతో పాటు మూగజీవాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇళ్లలో సైతం ఉండలేని పరిస్థితి. ఎండవేడిమికి గుంతలు, చెరువులు సైతం ఎండిపోతున్నాయి. చాలా తక్కువ చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి నీరు ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. చెరువుల్లో నీరు లేక పోవడం వల్ల మూగజీవాలకు అవసరమైన తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది.
అనారోగ్యం బారిన పశువులు
ఎండ తీవ్రత చాలా ఎక్కువుగా ఉండడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఆవులు కంటే గేదెలు ఎక్కువుగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గేదెలు నల్లగా ఉండడం వల్ల వాటిపై ఎండ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. పాడి పశువులకు వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు 27 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటే నోట్లో లాలాజలం తగ్గిపోతుంది. దీంతో నెమరవేసుకోవడానికి పశువులు ఇబ్బంది పడతాయి. దాహం ఎక్కువుగా ఉండడం వల్ల నీరు తాగి మేత సరిగ్గా తినవు. దీంతో శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గిపోయి పశువులు నీరసించిపోతాయి. పాల్ప ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతాయి.
రక్షణ ఇలా..
వడదెబ్బకు గురైన పశువులు తూలుతూ నడుస్తాయి. ఇటువంటి వాటిని గుర్తించి చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. ఐస్ ముక్కలను తలపై ఉంచాలి. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే సోడియం సాలిసిలైట్, పారాసిట్‌మాల్ ఇంజిక్షన్లు చేయాలి. ఎండ తీవ్రతను తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. షెడ్‌ల చుట్టూ అవిసె, సుబాబుల్ చెట్లను వేయడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. పశుగ్రాసం కూడా లభిస్తుంది. పాకల పైకప్పులను తాటాకులతో గాని గడ్డితో గాని కప్పాలి. పశువులను రోజుకు రెండు, మూడు సార్లు కడగాలి. సులువుగా అరిగించుకునే జావ, గంజి వంటివి తాగించాలి. పచ్చిగడ్డి ఎక్కువుగా ఇవ్వాలి.
ముందుకురాని రైతులు
ఉపాధిహామీ పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు కూటమి సర్కారు చెబుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన వారికే వీటిని కేటాయించడం, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం కారణంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాడి పశువుల వివరాలు..
జిల్లాలో 4,75,725 పాడి పశువులు ఉన్నాయి. ఇందులో ఆవులు 3,77,880 కాగా గేదెలు 97, 845 ఉన్నాయి. ఈ పశువుల ద్వారా ఏడాదికి 7.68 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండడం, పచ్చిమేత దొరకకపోవడం, తాగునీరు సరిపడా అందివ్వలేకపోవడంతో పాల దిగుబడి తగ్గిపోతోంది. ఒక్కో పాడి పశువు దగ్గర లీటరు నుంచి లీటరున్నర వరకు పాల తగ్గిపోతున్నాయి.
పాల ఉత్పత్తి తగ్గింది..
నాకు రెండు గేదెలున్నాయి. రోజుకి 12 లీటర్ల పాలు కేంద్రానికి వేసేవాడిని. ఎండ వల్ల పాలు తగ్గిపోయాయి. రోజుకి 9 లీటర్ల పాలు మాత్రమే ప్రస్తుతం వస్తున్నాయి. ఎండకు ఉండలేక గేదెలు ఇబ్బంది పడుతున్నాయి.
పి.రమణ, రైతు,
పెదవేమలి, గంట్యాడ మండలం
గడ్డి విత్తనాలు సిద్ధం..
పశుగ్రాసం కొరతను తీర్చేందుకు రైతుసేవా కేంద్రాలు, పశు వైద్యశాలల వద్ద 22 టన్నుల గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా 534 టన్నుల పశువుల దాణాను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ఎన్. దామోదరరావు, పశుసంవర్థకశాఖ జె.డి
పచ్చిమేత కొరతే కారణం..
వర్షాకాలం, శీతాకాలాల్లో పచ్చిమేత, నీరు సమృద్ధిగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వేసవికాలంలో నీరు, పచ్చిమేత కొరత ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది. పచ్చిమేత సాగు చేయడానికి కూడా సరిపడా నీటి సౌకర్యం లేదు.


