విజయనగరం: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ –2026 పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు సత్తా చాటినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌లో జరగబోయే ఏషియన్ గేమ్స్ ఎంపికల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన కిల్లక లలిత (టి–11) 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్స్.. కరణం గౌతమ్ (టి–12) లాంగ్‌జంప్‌లో సిల్వర్, 100 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించగా.. కొత్తింటి పైడిరాము (ఎఫ్–51) డిస్క్‌త్రోలో బ్రాంజ్ మెడల్ సాధించారని చెప్పారు. అంతర్జాతీయ ర్యాంక్‌ల ప్రకారం ఏషియన్ గేమ్స్‌కు ఎంపికై న వారి వివరాలు త్వరలో తెలుస్తాయని తెలిపారు. జిల్లా కీర్తి ఇనుమడింపజేసిన ముగ్గురు క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు.


