11 అర్జీల స్వీకరణ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిమిత్ర హల్‌లో శుక్రవారం నిర్వహించిన గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 11 అర్జీలు అందినట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ ఎ.దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సంతకవిటి: మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ఆర్జీదారులు పోటెత్తారు. భూ సమస్యలపై 15, సంక్షేమ పథకాలు, తాగునీరు, కాలువలు, ఉపాధి, తదితర అంశాలపై 63 వినతులు వచ్చాయి. వాసుదేవపట్నం పంచాయతీ పోతుల జగ్గుపేట గ్రామ సమీపంలో కోళ్లఫారం ఏర్పాటు చేస్తున్నారని, వాటివల్ల రోగాలు సంభవించే అవకాశం ఉన్నందున ఫారాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తమ అధీనంలో ఉన్న భూమికి సంబంధించి వన్‌బీ మంజూరు కావడం లేదని తాలాడ గ్రామానికి చెందిన డోల అప్పలరాము, డోల లక్ష్మున్నాయుడు, డోల చిలకారావు, డోల కృష్ణ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
పింఛన్ మంజూరు చేయండి..
గుళ్లసీతారాంపురం గ్రామానికి చెందిన ముగడ లక్ష్మి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వినతి ఇచ్చింది. ఏడాది కిందట తన భర్త మృతి చెందాడని, అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చింది.
దివ్యాంగుడి వద్దకు కలెక్టర్..
జావాం గ్రామానికి చెందిన బార్నాన సూర్యనారాయణ అనే దివ్యాంగుడు ట్రై సైకిల్ మంజూరు చేయాలని వినతి ఇచ్చేందుకు రాగా..కలెక్టర్ అతని వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.
తల్లికి వందనం అందడం లేదు..
తల్లికి వందనం పథకం తమకు అందడం లేదని ముకుందపురం గ్రామానికి చెందిన కోరాడ జ్యోతి, బొద్దూరు గ్రామానికి చెందిన వల్లూరు సంధ్య, వల్లూరు శ్రీనివాసరావు వినతిపత్రాలు అందజేశారు. డీఈఓతో మాటాడి సమస్య పరిష్కరిస్తానన కలెక్టర్ అర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోమన్, జేసీ సేథుమాధవన్, ఆర్‌డీఓ సుధారాణి, సంతకవిటి, రాజాం తహసీల్దార్లు బి.సుదర్శనరావు, రాజశేఖర్, ఎంపీడీఓ కె.సురేష్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
78 వినతులు స్వీకరించిన
అధికారులు


