హ్యాండ్‌బాల్‌ టోర్నీ విజేత విజయనగరం | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ టోర్నీ విజేత విజయనగరం

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

విజయనగరం: నగరంలోని రాజీవ్‌ మైదానం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. హోరాహోరీగా జరిగిన తుది పోరులో విజయనగరం జట్టు విజేతగా నిలిచి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. కృష్ణా, కడప జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ముగింపు కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరాజు, అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల శేఖర్‌, వి.మల్లేశ్వరరావు, శాయ్‌ అకాడమీ విశ్రాంత కోచ్‌ దేవేందర్‌, ఒలింపిక్‌ సంఘ నాయకుడు సీహెచ్‌.వేణుగోపాలరావు, ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ కోరాడ గోపాలరావు, సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు కమలనాభరావు, చింతాడ రవికుమార్‌, సీనియర్‌ అథ్లెట్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

స్కాలర్‌షిప్పులపై అవగాహన కల్పించండి

విజయనగరం అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘ఎస్‌ఈటీయూ’ ప్రీ–ెమెట్రిక్‌, పోస్ట్‌–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అధికారులను శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికీ ఈ స్కాలర్‌షిప్‌ అందేలా విద్యాసంస్థలు, సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలకు విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూఎంఏఎన్‌జీ యాప్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌, ఆధార్‌ ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్కాలర్‌షిప్‌ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమయ్యేందుకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ ప్రక్రియ కోసం బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేయాలని సూచించారు.

మక్కువ పరిసరాల్లో ఏనుగులు

మక్కువ: మండలంలోని ఏనుగుల గుంపు ప్రవేశించిందని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ తవిటినాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దబ్బగెడ్డ పంచాయతీ విజయరాంపురం పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయని, దీంతో సమీప ప్రాంతాలైన కోన, గోపాలపురం, దబ్బగెడ్డ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు ఆరుబయట నిద్రించరాదని, అలాగే పశువులను ఒంటరిగా కట్టరాదని సూచించారు.

భోగాపురంలో దొంగతనం

పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఓ ఇంటిలో దొంగలు పడి నాలుగున్నర తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు 60 కిలోల ఇత్తడి సామాన్లు దోచుకుపోయారు. సీఐ దుర్గాప్రసాద్‌ తెలియజేసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన క్యాసినకుర్తి సత్యనారాయణ ఇంటిలో గురువారం రాత్రి దొంగలు పడి విలువైన సొత్తు పట్టుకుపోయారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన బమ్మిడి గురునాథ్‌ ఇత్తడి సామాన్లతో వెళ్లిపోతుండగా.. సత్యనారాయణ, తదితరులు శుక్రవారం ఉదయం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వి. పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement