పాలకొండ రూరల్/పాలకొండ: మండలంలోని వెలగవాడ సమీపంలో తోటపల్లి సాగునీటి కాలువలో ఉపాధి పనులు చేసుకుని ఇంటికి వస్తున్న వేతనదారు మేదరమెట్ల సావిత్రి (62) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం పనులు చేసుకుని ఇంటకి వస్తున్న క్రమంలో హెరిటేజ్ పాల లారీ సావిత్రిని ఢీ కొనడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న సీఐ ఆమిటి ప్రసాద్, ఎస్సై డోల వెంకన్న, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఆశాజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు తమతో పనులు చేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సహచర వేతనదారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బస్సు ఢీకొని వ్యక్తి..
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వేగావతి నది బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన తెర్లి సింహాచలం (71) రామభద్రపురంలోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి గురువారం (ఈ నెల 28న) ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే ఎంతకీ బంధువుల ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకసాగారు. ఇంతలో కొట్టక్కి వేగావతి నది వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు గాయపడ్డారన్న విషయం తెలియడంతో అక్కడకు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో ఉన్న సింహాచలం కనిపించాడు. వెంటనే అతడ్ని సాలూరు సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


