● ‘ఆపరేషన్ దండాయన’తో వేగవంతమైన దర్యాప్తు
● మన్యం జిల్లాలో 39 మందిపై హిస్టరీ షీట్లు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 22 మంది ముద్దాయిలకు రెండేళ్లలో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ దండాయన’లో భాగంగా సకాలంలో దర్యాప్తు చేపట్టి, కోర్టు ట్రయల్ మానటరింగ్ ద్వారా ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, సాక్షులకు ధైర్యం కల్పించడం వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయన్నారు. గడచిన రెండు సంవత్సరాల్లో మొత్తం 19 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. మహిళల హత్యకు సంబంధించిన మూడు కేసుల్లో ముగ్గురికి జీవిత ఖైదు పడిందన్నారు. అలాగే అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన ఐదు కేసుల్లో ఏడుగురికి శిక్షలు పడగా.. వారిలో నలుగురికి 20 ఏళ్లు, ఒకరికి పదేళ్లు, మరొకరికి మూడేళ్లు, ఇంకొకరికి రెండేళ్ల జైలు శిక్ష పడిందని తెలిపారు. పోక్సో చట్టం కింద నమోదైన నాలుగు కేసుల్లో ఇద్దరికి ఏడేళ్లు, ఇద్దరికి మూడేళ్లు.. అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసుల్లో నలుగురికి పదేళ్లు, ఒకరికి ఏడాది జైలు శిక్ష పడిందని చెప్పారు. వరకట్న వేధింపుల కేసుల్లో ఇద్దరికి రెండేళ్లు, మహిళల వేధింపుల కేసులో ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షను న్యాయస్థానాలు విధించాయన్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 39 మందిపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే నేరాలు పునరావృతం కావని, అఘాయిత్యాలకు పాల్పడే వారు కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.


