జూన్‌నెల వస్తున్నా పూర్తిస్థాయిలో రాని వరి విత్తనాలు
విత్తనాల సరఫరాపై యంత్రాంగం నిర్లక్ష్యం
విత్తన కష్టాలు తప్పేలా లేవంటూ రైతుల్లో ఆందోళన
విత్తనాలు వస్తాయి
వచ్చేది
ఇచ్చేది
విజయనగరం ఫోర్ట్:
ఖరీఫ్–2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల సాగుకు రైతులు భూమిని దుక్కిచేసి సిద్ధం చేస్తున్నారు. వరి వెదలు, నారుపోతలకు వీలుగా భూమిని మలుస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ.. విత్తన సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను కలవరపెడుతోంది. జూన్ నెల వస్తున్నా జిల్లాకు కేటాయించిన వాటిలో సగం విత్తనాలు కూడా చేరలేదు. గతేడాది వలే ఈ ఏడాది కూడా విత్తనాలకు పాట్లు పడాల్సిందేనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా విత్తనాలు, ఎరువుల కొరత, కొనుగోలు కేంద్రాలు లేక పంట విక్రయాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూడా విత్తన కష్టాలు వీడేలా లేవన్న బెంగ రైతులను వెంటాడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు జిల్లాకు చేరేవి. రైతులకు ఎరువులు, పెట్టుబడి సాయం ఠంచన్‌గా అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, చంద్రబాబు సర్కారు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ పరిస్థితి...
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ పరంగా జిల్లాకు 41,810 వరి విత్తనాలను కేటాయించింది. వీటిలో ఇప్పటి వరకు 6,174 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరాయి. 35,636 క్వింటాళ్ల విత్తనాలు ఇంకా జిల్లాకు చేరాల్సి ఉంది. ఖరీఫ్‌సీజన్‌లో రైతులకు రాయితీపై విత్తనాలు అందిస్తారు.
ప్రైవేటు డీలర్ వద్ద కంటే కొంత అయినా ధర తగ్గుతుందనే భావనతో రాయితీపై అందించే విత్తనాలు ఆర్‌ఎస్‌కెల వద్ద కొనుగోలు చేస్తారు. అయితే జూన్ నెల వస్తున్నప్పటకీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌కేలకు పూర్తి స్థాయిలో విత్తనాలు చేరకపోవడం, మరోవైపు ప్రైవేటు దుకాణాల వద్ద విత్తన నిల్వలు ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అరకొర విత్తనాలు సరఫరా చేసి రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రభు త్వం పూనుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వరి సాగు ఇలా..
విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌లో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లు. ఈ మొత్తం విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరంగా జిల్లాకు కేటాయించింది 41,810 క్వింటాళ్లే. మిగిలిన 38,190 క్వింటాళ్లు విత్తనాలు రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పరంగా కేటాయించిన విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తారో తెలియని పరిస్థితి.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 41,810 క్వింటాళ్లు కేటాయించగా ఇంతవరకు 6,174 క్వింటాళ్లు విత్తనాలు జిల్లాకు వచ్చాయి.మిగిలి న విత్తనాలు కూడా త్వరలోనే సరఫరా అవుతాయి.
– వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి


