గంట్యాడ: ఆ గ్రామంలో అమలువుతోంది ప్రభుత్వ అధికారిక పథకం కాదు..క్షేత్రస్థాయి సిబ్బంది సృష్టించిన సొంత పథకం. అదే..మస్తరు వేయించుకో..ఇంటికి వెళ్లిపో.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి హామీ(వీబీజీరాంజీ) పథకం కింద కూలీలకు వంద రోజులకు పైగా పని దినాలు కల్పిస్తూ ఉదయాన్నే పని వేళలు కూడా నిర్ణయించారు. కానీ, గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామంలో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది. నిబంధనలు కాగితాలకే పరిమితమవగా..క్షేత్రస్థాయిలో అక్రమాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది.
కోనరాముడు చెరువులో కొండంత అవినీతి
కొండతామరాపల్లి గ్రామంలోని కోనరాముడు చెరువులో ఉపాధి పనులు జరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 312 మంది కూలీలు చెరువు వద్దకు వచ్చారు. అయితే, వారు వచ్చింది పని చేయడానికి కాదు..కేవలం మస్తర్లు వేయించుకోడానికే. ఉదయాన్నే వచ్చి హాజరు పట్టికలో సంతకాలు లేదా వేలిముద్రలు వేసేసి..ఎవరి ఇంటికి వారు దర్జాగా వెళ్లిపోయారు. రోజంతా చెరువు వద్ద తట్టా బుట్టా పట్టిన నాథుడే లేడు. పని చేయకుండానే వందలాది మందికి ప్రభుత్వ సొమ్ము చేతులు మారుతుండడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
విశ్రాంతి సమయం మాయం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి కూలీల పని వేళలు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఉంటాయి. ఇందులో ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు గంటపాటు భోజన విరామ సమయం ఉంటుంది. కూలీలు పని ప్రదేశంలోనే ఉంటూ, భోజనం చేసి, కాసేపు అలసట తీర్చుకోడానికి ఈ సమయాన్ని కేటాయించారు. కానీ ఈ గ్రామంలో అసలు పనే జరగకపోవడంతో..ఈ విశ్రాంతి సమయాల నిబంధనలన్నీ అసహాస్యం పాలవుతున్నాయి.
మేట్ల కనుసన్నల్లోనే భాగోతం
ఉపాధి పనులను పర్యవేక్షించడానికి, కూలీల నుంచి పని చేయించడానికి మేట్లు అని పిలిచే సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేట్లు తమ పరిధిలోని జట్టు సభ్యులను సక్రమంగా పని స్థలానికి తీసుకెళ్లి, పని చేయించి హాజరు నమోదు చేయాలి. కానీ కొండతామరాపల్లిలో కొందరు మేట్లు తమ బాధ్యతలను గాలికొదిలేశారు. కూలీలతో పని చేయించాల్సింది పోయి..కేవలం హాజరు తీసుకోవడానికే వారు పరిమితమయ్యామనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. మేట్ల సహకారంతోనే ఈ అక్రమ దందా సాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారుల అలసత్వం..కానరాని స్పందన
ప్రజాధనం ఇలా యథేచ్ఛగా దుర్వినియోగం అవుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఉపాధి అవినీతి భాగోతంపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు సాక్షి రిపోర్టర్ గంట్యాడ మండల ఏపీవోను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొండతామరాపల్లిలో జరుగుతున్న ఉపాధి అక్రమాలపై విచారణ జరపాలని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కొండతామరపల్లిలో యథేచ్ఛగా ఉపాధి అక్రమాలు
ఒక్కరోజే 312 మంది ఆబ్సెంట్..కానీ రికార్డుల్లో ప్రెజెంట్
ప్రభుత్వ ధనం దుర్వినియోగంపై స్థానికుల ఆగ్రహం
ఫోన్ ఎత్తని ఏపీఓ..స్పందించని అధికారులు


