విజయనగరం రూరల్: మండలంలోని కోరుకొండ గ్రామానికి చెందిన కొంతమంది రైతుల వ్యవసాయ పొలాలకు, పశువుల కళ్లాలకు వెళ్లేదారికి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అడ్డుగా గేటు ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ గ్రామానికి చెందిన సిరిపురపు సత్తిబాబు స్థలం వెనుక గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు, పశువుల కళ్లాలు ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఇదే దారిని రైతులు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. చట్ట ప్రకారం రైతులు తమ పంట పొలాలకు వినియోగించే దారిని అడ్డుకోవడానికి వీలులేదు. అయినా సదరు రైతు ఏకపక్షంగా అనధికారికంగా కోళ్లఫారం ఏర్పాటు చేసుకుని రైతులు వినియోగించే రోడ్డుకు అడ్డంగా దారికి గేటు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామానికి చెందిన రైతులు గతేడాది డిసెంబర్‌లో గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు రైతు అధికార పార్టీ నేతలను కలిసి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులు, గ్రామ పెద్దలపైనే కేసులు నమోదు చేయించారు. దీంతో రైతులందరూ కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయగా గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించా రు. అయినా స్థానిక అధికారులు అధికార పార్టీ షాడో నేత ఒత్తిడికి భయపడి చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా కోళ్లఫారం షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, రైతులు తమ పొలాలకు వెళ్లే దారిని తమ సొంత స్థలమని అడ్డుకోవడం శోచనీయమని, కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని దారి ఇప్పించాలని కోరుకొండ గ్రామ రైతులు కోరుతున్నారు.
కళ్లాలకు, పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు
అనుమతుల్లేని కోళ్లఫారానికి గేటు ఏర్పాటు చేసిన రైతు
అధికారులు చర్యలు తీసుకోవాలని
కోరుతున్న కోరుకొండ గ్రామ రైతులు


