విజయనగరం గంటస్తంభం: రాజీవ్ క్రీడా మైదానం వేదికగా నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రస్థాయి జూనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి విశాఖపట్నం సీసీఎస్ క్రైమ్ బ్రాంచ్ సీఐ కోరాడ రామారావు, సీఐ సోమశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించారు. జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు బత్తుల శేఖర్, వి.మల్లేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కోరాడ గోపాలరావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వరరావు, హ్యాండ్‌బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రాజు, అండర్–19 మాజీ ప్రధాన కార్యదర్శి బొమ్మన రామారావు, ఖోఖో సంఘం నాయకులు కమలనాభరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాయ్ అకాడమీ రిటైర్డ్ కోచ్ దేవేంద్ర, జిల్లా హ్యాండ్‌బాల్ కార్యదర్శి వి.మల్లేశ్వరరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.


