మహానాడా..? మనస్పర్థల సభా..? | - | Sakshi
Sakshi News home page

మహానాడా..? మనస్పర్థల సభా..?

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నచ్చని మొగుడికి పెళ్లాం చేయి తగిలినా తప్పే.. కాలు తగిలినా తప్పే’ అన్నట్లుగా ఉంది గజపతినగరంలో టీడీపీ పరిస్థితి. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక.. తెలుగు ప్రజలందరినీ ఏకం చేసిన పార్టీ అంటూ డైలాగులు కొట్టి ఫ్లెక్సీలు పెట్టే టీడీపీ నాయకులు తమ పార్టీలోనే కొందరిని మాత్రం అసింటా.. అసింటా అంటూ అస్పృశ్యతను పాటిస్తున్నారు. పార్టీ సాధారణ సభ్యుల నుంచి సర్పంచ్‌.. ఎంపీటీసీ.. ఇలా అన్ని స్థాయిలవాళ్లకు పిలుపువచ్చినా.. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి మాత్రం పిలుపు పరువుతీసేలా మంగళవారం రాత్రి 9 గంటలకు, కేవలం ఆయనకు మాత్రమే పిలవడం గమనార్హం. దీనిపై స్పందించిన అప్పలనాయుడు కూడా మీరు చాలా ఆలస్యంగా పిలిచారని, తన వెనుక ఉన్న వారికి ఎటువంటి సమాచారం లేదని, ప్రత్యేకంగా తామే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. విజయనగరంలో తన అనుచరవర్గంతో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో నిర్వ హిస్తున్న మహానాడు కార్యక్రమాలు గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో చీలికలను బహిర్గతం చేశాయి. తీవ్ర మనస్పర్థల సభగా మారిపోయింది. ఒకే పార్టీ.. రెండు వర్గాలు.. మూడు కథలుగా సాగుతున్న ఇక్కడి రాజకీయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడుకి సొంత పార్టీలోనే తలుపులు మూసేశారా? అనే చర్చ శ్రేణు ల్లో బలంగా నడుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో ఎవరి మహానాడు వాళ్లదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు.

తొక్కేస్తున్న చిన్నాయన..!

గజపతినగరం నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీచేస్తున్న కొండపల్లి వంశీయుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడును తన చిన్నాన్న కొండలరావు, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్‌లు రాజకీయంగా తొక్కేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జరిగిన ఎన్నికల్లో అప్పలనాయుడుకు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోగా.. తాజాగా మహానాడు కార్యక్రమానికి తన పరువు తీసేలా ముందురోజు రాత్రి ఆహ్వానించడం చర్చకు తావుతీసింది. తొలుత టీడీపీలో ఉన్న కొండలరావు తర్వాత ప్రజారాజ్యం, అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీలో పదవులు అలంకరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉంటూ మూడు పార్టీలు మారిన సందర్భాల్లో తన వెంట ఉన్న నాయకులకే నామినేటేడ్‌ పోస్టుల్లో అవకాశం కల్పించడంపై టీడీపీ నమ్ముకుని ఉన్న అప్పలనాయుడు వర్గానికి మింగుడుపడడం లేదు.

కె.ఎ.నాయుడికి టీడీపీలోనే తలుపులు మూసేశారా..?

గజపతినగరంలో ఎవరి మహానాడు వాళ్లదే.. .

టీడీపీలో మర్యాదకు మంగళం..?

రాజాంలో తమ్ముళ్ల బాహాబాహీ

రాజాం: రాజాం మండలం కంచరాం సమీపంలోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో బుధవారం జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు కుమ్ములాటకు దిగారు. భోజనాలు సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిని ఒకరు తోసుకుంటూ, కొట్టుకొంటూ రిసార్ట్‌ ప్రాంగణంలో పరుగులుతీశారు. కొంతమంది నాయకులు రంగంలోకి దిగి వివాదాన్ని సద్దుమణిగించారు. భోజనాలు చాలకపోవడం వల్లే కార్యకర్తల మధ్య వివాదం తలెత్తిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఇదే వేదికపై రాజాం మండలంలోని ఓ పంచాయతీకి చెందిన రెండు టీడీపీ వర్గాలు సర్పంచ్‌ పదవి కోసం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఎదుటే కుమ్ములాటకు దిగడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement