ప్రతిభావంతులకు పోస్టులు దక్కేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు పోస్టులు దక్కేనా?

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

విజయనగరం అర్బన్‌: జిల్లా విద్యాశాఖలో ప్రతిభ కంటే ‘పలుకుబడి’కే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న 9 సెక్టోరియల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా వాటికి 50 మంది వరకు వివిధ కేడర్‌ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు బుధవారం చేపట్టారు. అయితే, ఇంటర్వ్యూలు నిర్వహించక ముందే తెరవెనుక రాజకీయ నాయకుల ‘సిఫార్స్‌ లెటర్ల’ సంస్కృతి జోరందుకుందనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన వారు, ప్రతిభ, సీనియారిటీ, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షలో డిప్యుటేషన్లపై పనిచేసే అవకాశం దక్కేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ఎవరు సిఫార్సు చేశారు... వారి ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది’ అన్న అంశమే విద్యాశాఖలో అత్యంత కీలకంగా మారిందని ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బెస్ట్‌ టీచర్‌ అవార్డుల ఎంపిక నుంచి, డిప్యుటేషన్లు, కీలక పోస్టింగులు, చివరికి సెక్టోరియల్‌ పోస్టుల భర్తీ వరకు అన్నింటిలోనూ అర్హత కంటే రాజకీయ పరిచయాలకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పనిచేసే వారికి నిరుత్సాహం...

నిజాయితీగా విద్యార్థుల అభ్యున్నతి కోసం రాత్రింబవళ్లు కష్టపడే ప్రతిభగల ఉపాధ్యాయుల కంటే రాజకీయ లేదా సంఘాల పరంగా పలుకుబడి ఉన్నవారికే అవకాశాలు దక్కుతుండడం క్షేత్రస్థాయిలో పనిచేసే వారిలో నిరుత్సాహం ఆవహిస్తోంది. ‘ఎంత కష్టపడి పనిచేసినా ప్రయోజనం లేనప్పుడు.. వ్యవస్థ కోసం ఎందుకు తపించాలి?’ అనే భావన ఉపాధ్యాయుల్లో బలబడుతోంది. ఇది పరోక్షంగా విద్యావ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యువ ఉపాధ్యాయుల్లోకి తప్పుడు సంకేతాలు

ప్రతీ చిన్న అవకాశానికి ప్రజాప్రతినిధులు, నాయకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడడంతో విద్యాశాఖపై రాజకీయ, సంఘాల ప్రభావం మితిమీరిపోతోంది. ఇదిలా ఉంటే కొత్తగా కొలువుల్లోకి చేరిన యువ ఉపాధ్యాయుల్లోకి కూడా ఒక తప్పుడు సంకేతం వెళ్లోంది. ‘పాఠశాలలో బాగా పనిచేయడం కంటే.. పైస్థాయిలో బలమైన పరిచయాలు పెంచుకుంటేనే గుర్తింపు, మంచి పోస్టింగులు వస్తాయి’ అనే ధోరణి వారిలో పెరుగుతోందని విద్యాశాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

పారదర్శక ఎక్కడ...?

పైరవీల సంస్కతికి అడ్డుకట్ట వేయాలంటే నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని విద్యావర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యక్తిగత ప్రయోజనాలు, పైరవీలకు తావివ్వకుండా వ్యవస్థ పరిరక్షణ కోసం, నిజాయితీ గల ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యాప్రేమికులు సూచిస్తున్నారు. బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ప్రతిభకు పట్టం కడతారో లేక సిఫార్సులకే పోస్టులు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.

సమగ్ర శిక్ష పోస్టుల భర్తీపై ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు

9 పోస్టులకు 50 మంది పోటీ

పైరవీలకు పెద్దపీట వేస్తున్నారనే

ఆరోపణలు

Advertisement
 
Advertisement
Advertisement