బొబ్బిలిరూరల్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని దీన స్థితి. గ్రామంలో 70 ఏళ్ల క్రితం గ్రామదేవత పండగలకు, అమ్మవార్ల వారాల పండగలకు పూజారిగా వ్యవహరించినందుకు గాను నాటి గ్రామ పెద్దలు, ప్రజలు ఏకమై ఆ కుటుంబానికి పంచాయతీ స్ధలం కేటాయించారు. ఆనాటి ఇంటి పెద్ద మృతి చెందడం, వైస్సార్‌సీపీ సానుభూతి పరులన్న నెపంతో గడిచిన 3 నెలలుగా ఆ కుటుంబంపై పచ్చనేతలు పగబట్టారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని కుట్ర పన్నారు. ఇంకేముంది అది పంచాయతీకి చెందిన స్థలమని ఖాళీచేయాలంటూ, ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టారు.దీంతో ఆయన ఆదేశాలతో ఆగమేఘాలమీద పంచాయతీ యంత్రాంగం మంగళవారం ఆ ఇంటిి ముందు హడావుడి సృష్టించింది. వెంటనే ఇంటిని ఖాళీచేయాలని ఎంపీడీఓ, ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రటరీ తమ సిబ్బందితో ఆ ఇంటికి చేరుకుని నానా రభస చేశారు. కరెంట్ కట్‌చేయాలని, ఒకరు, తాగునీటిని బంద్ చేయాలని మరొకరు, ఇంట్లో సామగ్రి బయట పడేయాలని ఇంకొకరు ఇలా ఆ కుటుంబానికి మంగళవారం నరకం చూపించారు. ఏమైనా ఉంటే ఎమ్మెల్యేకు చెప్పుకోవాలని ఆయన ఆదేశిస్తే యఽథావిధిగా మీరు ఉండవచ్చని సలహా ఇస్తూ కొంత సమయం కేటాయిస్తున్నట్లు తెలియజేశారు.
విలేకరుల ముందు వాపోయిన పేదకుటుంబం
దీంతో బాధిత కుటుంబం బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైంది. గ్రామంలో పూజారిగా వ్యవహరించిన రాపాక జోగినాయుడికి నీడ కల్పించాలన్న దృక్పథంతో 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు 60 అడుగుల గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించారు. దీంతో జోగినాయుడు ఆ స్థలంలో పెంకుటిల్లు నిర్మించుకుని కుటుంబంతో నివాసముండగా, ఆయనకు లక్ష్మి, తౌడమ్మ, భరణి అనే ముగ్గురు కుమార్తెలు అక్కడే జన్మించారు. ఇటీవల ఆయన, ఆయన భార్య మృతి చెందడంతో కుమార్తె ఒంటరి మహిళ లక్ష్మి, తౌడమ్మ, ఆమె భర్త మహేష్, పిల్లలు ప్రతిమ, హరికృష్ణలతో పాటు ఆదే ఇంటిలో కొన్నాళ్లుగా నివసిస్తూ కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఆ కుటుంబం గత ఎన్నికల్లో వైస్సార్‌సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారన్న నెపంతో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు మరో ఐదుగురు ఆ కుటుంబంపై కక్షగట్టారు. బొబ్బిలి కోటలోకి పిలిపించారు. వారి కుట్రలను గమనిస్తున్న మహేష్ గ్రామంలోని 300 మంది సంతకాలతో ఆ నివాసంలో ఉండేందుకు తమకు అభ్యంతరం లేదంటూ సంతకాలు చేసి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దయచేసి తమను రోడ్డున పడేయవద్దని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నాడు. అయినప్పటికీ గ్రామపెద్దల కుట్రలు ఆగకపోవడంతో మహేష్ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. పంచాయతీకి పన్నులు కడుతున్నామని, ఇన్నేళ్లుగా తామే కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్లు కోర్టుకు ఆధారాలు చూపాడు. ఆ కేసు కోర్టులో కొనసాగుతుండగా ఆకస్మాత్తుగా పంచాయతీ అధికారులు మంగళవారం మహేష్ ఇంటిమీద పడ్డారు. కోర్టునుంచి తీర్పు వచ్చాక చూసుకోవచ్చని ప్రస్తుతం ఇంటిని ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారని మహేష్ వాపోతున్నాడు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని, తమకు మరోచోట నివశించేందుకు ఎటువంటి స్థలాలు లేవని, ఇంతటి మండుటెండల్లో ఎక్కడ తలదాచుకోవాలో వారే చెప్పాలని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఉన్నతాధికారులు, మానవతా వాదులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆడబిడ్డలతో ఎక్కడికి పోతామంటూ బావురుమంటున్నాడు. టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం, కుట్ర, కక్షలకు తమ కుటుంబం బలైపోతోందని వాపోతున్నాడు. కనికరం లేని ప్రజాప్రతినిధులకు పేద బతుకుల దీనదుస్థితి ఎలా ఉంటుందో తెలియదని, రాజకీయనాయకులు తమపై చేస్తున్న కక్షలకు అధికార యంత్రాంగం వత్తాసు పలకడం బాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా తమ కుటుంబంపై కక్ష మాని మానవతాదృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నారు.
ఆ నిరుపేద కుటుంబం ఏం నేరం చేసింది. ఏ భగవంతుడు వారి మొర ఆలకిస్తాడు. ఏ అధికారి వారి అవస్థలు దూరం చేస్తాడు. ఏ ప్రజాప్రతినిధి వారికి సాయం చేస్తాడు. గ్రామ పెద్దలు కక్షగట్టి వారి ఇంటిని ఖాళీ చేచించాలని చూస్తున్న కుట్ర ఎలా భగ్నమవుతుందో వేచి చూడాలి.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల
ముద్ర వేసి కక్షసాధింపు
70 ఏళ్లుగా నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయించాలన్న కుట్ర
ఎమ్మెల్యే హుకుం జారీచేయడంతో అధికారుల పరుగులు
కన్నీటి పర్యతమవుతున్న పేదకుటుంబం


