భగపట్టిన భానుడు..! | - | Sakshi
Sakshi News home page

భగపట్టిన భానుడు..!

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

భగపట్టిన భానుడు..!

నెల రోజుల వ్యవధిలో వడదెబ్బతో ముగ్గురి మృతి

బాధితులు 44 మంది

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రాయి సన్యాసమ్మ, ఈమెది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఈనెల23వతేదీన ఎండతీవ్రతకు ఇంటి వద్దే వడదెబ్బకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా మృతిచెందింది.

విజయనగరం ఫోర్ట్‌: పార్వతీపురం టౌన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో వడదెబ్బ తగిలి గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం పార్వతీపురం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

● రాజాం మండలం డోలపేటకు చెందిన ఎల్‌.రామకృష్ణ వడదెబ్బ బారిన పడి మరణించాడు.

● కొత్తవలస మండలం ముసిరాంకు చెందిన కె. చైత్ర అనే 7 ఏళ్ల బాలిక వడదెబ్బకు గురైంది. కొత్తవలస పీహెచ్‌సీలో వైద్యం చేయించగా కోలుకుంది.

● కొత్తవలస మండలం దేవాడకు చెందిన ఆర్‌, జస్మిత అనే రెండు ఏళ్ల చిన్నారి వడదెబ్బకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు కొత్తవలస పీహెచ్‌సీలో చికిత్స చేయించగా కోలుకుంది. వీరే కాదు. జిల్లాలో అనేక మంది భానుడి ప్రతాపానికి తాళలేక అల్లాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విలవిలాడిపోతున్నారు. ఎండలో ప్రయాణించేవారితో పాటు ఇళ్లలో ఉన్న వారు సైతం వడదెబ్బకు గురవుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఉష్ణోగ్రతలు 43,44 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులతో జనం సెగలు కక్కుతున్నారు.

పరిహారంపై స్పష్టత కరువు:

వడదెబ్బ బారిన పడి మృతి చెందిన వారికి అందజేసే పరిహారంపై స్పష్టత కరువైంది. వడదెబ్బ మృతులకు పరిహారంపై ఎటువంటి స్పష్టత టీడీపీ సర్కార్‌ ఇవ్వలేదు. వడదెబ్బ బారిన మృతి చెందిన వారి వివరాలు ఎవరికి తెలియజేయాలి. వాటిని ఎవరు నమోదు చేస్తారు అనేదానిపై టీడీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రకృతి వైపరీత్యం అయిన వడదెబ్బ వల్ల మృతి చెందిన కుటుంబ సభ్యులు ప్రభుత్వం పరిహారం గురించి ఎటువంటి ప్రకటన చేయక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఫొటోలో కనిపిస్తున్న మృతుడి పేరు లక్కిడాపు రఘు(32). ఇతనిది చీపురుపల్లి. మెయిన్‌ రోడ్డులో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెప్పులు కుడుతున్న ప్రాంతంలోనే వడదెబ్బకు గురయ్యాడు. దీంతో స్థానికులు చీపురుపల్లి ఆస్సత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

పీహెచ్‌సీలో చికిత్స

వడదెబ్బ బారిన పడి పీహెచ్‌సీకి తీసుకుని వచ్చిన రోగులకు చికిత్స అందిస్తున్నాం. వడదెబ్బకు సంబంధించిన అన్ని రకాల మందులు,ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాం. వడదెబ్బ మృతుల పరిహారం గురించి, వివరాల నమోదు గురించి తెలియదు.

డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement