● ఈఎస్‌ఐ కార్పొరేషన్ బ్రాంచి మేనేజర్ జి.జీవరత్నం
విజయనగరం ఫోర్ట్: ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సువిధ, సమాగం, నిధి ఆప్‌కే నికత్ కార్యక్రమాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్ బ్రాంచి మేనేజర్ జి.జీవరత్నం అన్నారు. స్థానిక దాడి మోటార్స్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 27వతేదీన ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.కార్మికుల ఈఎస్‌ఐ సమస్యలు, పీఎఫ్ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కె. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఆటో పల్టీ: మహిళకు గాయాలు
మెరకముడిదాం: మండలంలోని గర్భాం నుంచి ఉత్తరావల్లి వైపు పాసింజర్లతో వెళ్తున్న ఆటో బుదరాయవలస సమీపంలో బుధవారం సాయంత్రం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఉత్తరావల్లి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారస్తురాలు పార్వతమ్మ తల, ముఖంపైన తీవ్రగాయాలయ్యాయి. పార్వతమ్మను స్థానికులు 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. ఈఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ విషయం తెలుసుకున్న బుదరాయవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరుపై స్థానికుల నుంచి ఆరా తీసి కేసు నమోదు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
బొబ్బిలి: పట్టణంలోని రావు వారి వీధిలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో రాపాక రమణ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో ఇంటిలోని నిత్యావసరాలు, గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.2లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక నాయకులు బొత్స అప్పులు రమణ బాధిత కుటుంబసభ్యులకు నిత్యావసరాలను అందజేశారు.
వైద్యాధికారి అసభ్యకర ప్రవర్తన
● ఏపీవీపీ అధికారులు గుట్టుగా
ఉంచినట్లు ఆరోపణలు
● వైద్యాధికారితో బాధితులకు క్షమాపణ?
విజయనగరం ఫోర్ట్: వైద్య పరిషత్ పరిధిలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో ఏపీవీపీ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యాధికారి ఇద్దరు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని బాధిత మహిళా ఉద్యోగులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వైద్యాధికారులను నిలదీసినట్లు పెద్దఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు మహిళా ఉద్యోగులకు సదరు వైద్యాధికారితో క్షమాపణ చెప్పించినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఈసంఘటనను ఏవీపీపీ అధికారులు బయటకు పొక్కనీయకుండా గుట్టుగా దాచినట్లు సమాచారం. అస్పత్రి సిబ్బందిని కూడా ఈ విషయంపై ఎక్కడా చెప్పవద్దని అధికారులు ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి డాక్టర్ పద్మశ్రీ రాణి వద్ద సాక్షి ప్రస్తావించగా మహిళల పట్ల వైద్యాధికారి అసభ్యకర ప్రవర్తన విషయం గురించి గజపతినగరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగితే ఫిర్యాదు ఎవరూ ఇవ్వలేదని తెలిపారని చెప్పారు.


