చికెన్
● రాజాంలో సాయిచైతన్య రియల్ ఎస్టేట్ బాధితుల నిరసన
● డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ బాధితుల ఆందోళన
● పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
రాజాం: రాజాంలో రియల్ వ్యాపారి మోసానికి పలువురు పేదల బలయ్యారు. 2017వ సంవత్సరంలో బుచ్చింపేట–గడిముడిదాం రోడ్డులో పొలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన సాయిచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థ ఖాతాదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా చేతులెత్తేసింది. దీంతో రాజాం, వంగర, వీరఘట్టం, కొమరాడ, పార్వతీపురం, రేగిడి తదితర మండలాల్లోని పలువురు బాధితులు బుధవారం రాజాం చేరుకుని నిరసన చేపట్టారు. తొలుత సాయిచైతన్య రియల్ ఎస్టేట్ యజమాని వ్యాపారం నిమిత్తం చూపించిన సైట్‌లో ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడి నుంచి రాజాం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 2017, 20 సంవత్సరాల్లో రాజాంలో శీర నారాయణరావు అనే వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారని, పలువురు ఏజెంట్ల ద్వారా బుచ్చింపేట–గడిముడిదాం గ్రామాల మధ్య ఖాళీ స్థలాలు చూపించారని బాధితులు వాపోయారు. రాజాం పట్టణానికి దగ్గరగా ఉండడంతో ఈ స్థలాలు తమకు లాభిస్తాయన్న ఆశతో ఒక్కో నెల రూ.3000 చొప్పున చెల్లించి రియల్ ఎస్టేట్‌వ్యాపారికి డబ్బులు చెల్లించామని వెల్లడించారు. ఏడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పాటు డబ్బులు వాయిదాలుగా చెల్లించామని, ఒక్కొక్కరు రూ.3.50 లక్షలకు పైగా నగదు వాయిదాల రూపంలో వ్యాపారికి చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. ఇంతవరకూ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయలేదని. గత ఆరు నెలలుగా నారాయణరావు అందుబాటులో లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉంటున్నట్లు సమాచారం ఉందని, సంబంధిత వ్యాపారిని పట్టుకుని, తమకు ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.


