● పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం
● ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు
దత్తిరాజేరు: మండలంలోని గుచ్చిమి గ్రామానికి చెందిన సొంగల రామునాయుడు, రూప దంపతుల ఆరు నెలల పాప మోహనకు ఎస్‌ఎంఏ జెనెటిక్ (కండరాలు, క్షీణత) ఆరుదైన వింత వ్యాధి సోకినట్లు హైదరాబాద్‌లోని నిజాం ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఈ పేద దంపతులకు తొలి సంతానంగా కుమారుడు మోహన్ వంశీ జన్మించగా ఇదే వ్యాధి సోకడంతో అప్పట్లో గుర్తించలేక పోవడం వల్ల 8నెలలకే మృతి చెందాడు. మళ్లీ రెండో సంతానం కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మూడో సంతానంగా జన్మించిన పాపకు ఈ వింతవ్యాధి వచ్చింది. పాప ఆరోగ్యం నయం కావాలంటే రూ.16 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెప్పడంతో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసి సమస్యను చెప్పామని రూ. 20లక్షల వరకు ప్రభుత్వ సాయం వస్తుందని ఆయన చెప్పడంతో నిరుపేదలమైన తమను దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా పాప ఎప్పటికీ పెరుగుదల లేక పోవడంతో మల్లారెడ్డి ఆస్పత్రిలో చూపించగా అక్కడి వైద్యులు నిమ్స్‌కు వెళ్లాలని సూచించడంతో ఈవ్యాధి బయటపడిందని తల్లిడండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆదుకుని తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


