● ఏరియా ఆసుత్రికి క్యూకట్టిన బాధితులు
పాలకొండ రూరల్: పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కల గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురించేస్తున్నాయి. బుధవారం నగరపంచాయతీ పరిధిలోని జట్టివారివీధి, లోగిడివీధి, గెద్దవీధి తదితర ప్రాంతాల్లో వీధికుక్క స్థానికులపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో జి.వెంకటలక్ష్మి, సీహెచ్ చాణక్య, కె.మాలతీకుమారి, వీఆర్వో సీహెచ్.శ్రీనివాస్‌తోపాటు జి.ధనలక్ష్మి, బి.లావణ్య, కె.చిన్నమ్మడు, టి.శివయ్య తదితరులు గాయపడ్డారు. బాధితుల కాళ్లు, చేతులు, పిక్కలపై శునకం కరవడంతో వారంతా పాలకొండ ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు. మరికొంతమందిపై కూడా ఆ శునకం విరుచుకుపడినట్లు క్షతగాత్రులు వాపోతున్నారు. కళ్లముందే పిల్లలపై దాడిచేయడంతో అడ్డుపడిన వారిని కరిచినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యురాలు సునీతాచంద్రిక బాధితులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. కొద్ది రోజులుగా కుక్కల సమస్యలపై నగర అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, వారం క్రితం కస్పావీధి సమీపంలో కుక్కలు పలువురిని గాయపర్చినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.


