వంగర: మండల పరిధి అరసాడ గ్రామంలో గతంలో డి.దుర్గారావు స్క్రాప్ షాపులో జరిగి న చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై షేక్ శంకర్ మంగళవారం తెలి పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన పేండ్ర నాయుడు, పేండ్ర జీవన్‌లను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పాలకొండ తరలించామన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పప్పల రామకృష్ణ(38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత తన తండ్రికి ఆయాసంగా ఉందని టేబుల్ ఫ్యాన్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ వైరు ఛాతీకి తగలడంతో షాక్ తగిలి వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు పాప, బాబు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


