రాత్రి ఎనిమిది గంటలు దాటిందంటే చాలు..ఊరి మీద పొగ ముసురుకుంటుంది..ఇంట్లో తలుపులు మూసుకున్నా దుర్వాసన లోపలికే వస్తుంది..పిల్లలు దగ్గుతో వణికిపోతున్నారు..ముసలివాళ్లు ఊపిరి పీల్చుకోలేక అవస్ధ పడుతున్నారు. ఇది ఏదో సినిమా కథ కాదు..విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ప్రతిరోజూ అనుభవిస్తున్న నరకానికి ప్రతిరూపం ఈ కథనం.
కాలుష్యంతో ప్రజల బాధలు..
చూసీ చూడనట్టు అధికారులు
విజయనగరం గంటస్తంభం: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఏర్పాటైన కంపెనీలు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదికి వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెర్రీ, అరోరా, సహారా ఇంపెక్స్ కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన పొగలు, వ్యర్థాలతో బొబ్బిలి మండలంలోని మెట్టవలస, పణుకువలస, గున్నతోటవలస, కొత్తపెంట, ఎం.బూర్జవలస, నారాయణప్పవలస గ్రామాలు కాలుష్య కాటుకు బలవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ప్రజల ఆరోగాన్ని కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ఫిర్యాదులు వచ్చినా స్పందించకుండా కంపెనీలకే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఊపిరితిత్తుల మీద విషపు కత్తులు
పగటిపూట అంతా సవ్యంగానే ఉన్నట్లు సమాజానికి నాటకమాడే ఈ కంపెనీలు, చీకటి పడగానే తమ అసలు రంగును బయటపెడుతున్నాయి. ఖరీదైన కాలుష్య నియంత్రణ ఫిల్టర్లను రాత్రి వేళల్లో పూర్తిగా కట్టేసి, దట్టమైన నల్లటి కెమికల్ పొగను, గొంతును నులిమేసే ఘాటైన రసాయన వాయువులను వాతావరణంలోకి వదులుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఆ విషవాయువుల దెబ్బకు ఊపిరాడక, గొంతు రాక, ఇళ్లల్లో నిద్రిస్తున్న పసిపిల్లలు ఉక్కిరిబిక్కిరవుతూ ఏడుస్తూ లేస్తున్నారు. వృద్ధులు గుండెలు పట్టుకుని శ్వాస కోసం కొట్టుమిట్టాడుతున్నారు. తెల్లవారేసరికి ఇళ్లపై, వాకిళ్లలో, చివరకు తినే అన్నం గిన్నెలపై కూడా నల్లటి బొగ్గు పొడి, బూడిద పేరుకుపోతోంది. ఇక్కడి ప్రజలకు ప్రశాంతంగా నిద్రపోయే హక్కు కూడా లేకుండా పోయింది.
విషంగా మారిన చెరువు నీరు
ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఘెరమైన రసాయన వ్యర్థాలను, కెమికల్ నీళ్లను ఏ విధమైన శుద్ది చేయకుండా రాత్రికి రాత్రే బయట ఉన్న వాగుల్లోకి, చెరువుల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల శతాబ్దాలుగా గ్రామస్తులకు, పశువులకు తాగునీరిచ్చిన చెరువులు నేడు రంగు మారి, దుర్వాసనతో విషపు కుంటలుగా మారాయి. పెంట గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బొబ్బిలి తహసీల్దార్‌ను ఆశ్రయించారు. ఆయన తక్షణమే స్పందించి బెర్రీ కంపెనీ వారికి ఫోన్ చేసి హెచ్చరించగా, ఇక కాలుష్యం లేకుండా చూస్తాం అని సదరు యాజమాన్యం అప్పట్లో అబద్ధపు హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఆ కలుషిత నీటిని తాగిన పశువులు, గొర్రెలు, పక్షులు కళ్ల ముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తున్నాయి. పచ్చని పొలాలు చవిటి నేలలుగా మారుతున్నాయి.
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని కాలుష్య నియంత్రణ శాఖ
కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం
నిబంధనలు పక్కనబెట్టి కంపెనీలకు గ్రీన్ సిగ్నల్?
బెర్రీ, అరోరా, సహారా ఇంపెక్స్ కంపెనీలపై ప్రజల ఆగ్రహం
కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న
ఐదుగ్రామాలు


