గుర్ల: మండలంలోని గుజ్జింగివలస గోశాలకు వచ్చిన పశువులను గోవధకు తరలిస్తున్నారనే అనుమానంతో గ్రామానికి చెందిన యువకులు సోమవారం రాత్రి పశువులు తరలించే వ్యాన్లను అడ్డుకున్నారు. డెంకాడ మండలంలో పట్టుబడిన 10 పశువులను అధికారులు గుజ్జింగివలసలోని గోశాలకు తరలించారు. ఆ పశువులను గోవధకు ఇతర ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తుండగా రెండు వ్యాన్‌లను గ్రామ యువత అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
మతిస్థిమితం లేని
యువకుడి ఆచూకీ లభ్యం
కొత్తవలస: మండలంలోని సంతపాలెం గ్రామానికి చెందిన షేక్ రజాక్ (23) అనే మతిస్థిమితం లేని యువకుడి ఆచూకీని పోలీసులు మంగళవారం కనుగొన్నారు. రజాక్ సోమవారం అదృశ్యం అవడంతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ టీవీ విజయకుమార్, ఎస్సై జోగారావులు గాలింపుచర్యలు చేపట్టారు. మండలంలోని సంతపాలెం–సబ్బవరం రోడ్డులో గల జగనన్న కాలనీ సమీపంలో రజాక్ ఉండడాన్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.రజాక్ అన్న షేక్ అబ్దుల్లాకు అప్పగించారు. ఈ తరహా వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలని అబ్దుల్లాకు సీఐ హితవు పలికారు. ఈ సందర్భంగా అబ్దుల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
● 22 తాత్కాలిక చెక్ పోస్టుల ఏర్పాటు
విజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణపై నిఘా పెట్టామని ఎస్పీ దామోదర్ మంగళవారం స్పష్టం చేశారు. ఇందుకోసం 5 శాశ్వత చెక్‌పోస్టులు 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 30 మూవింగ్ పార్టీలు, దాంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ముగ్గురు సీఐలతో పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు. బక్రీద్ పండగను ముస్లిం సోదరులు మతసామరస్యం పాటిస్తూ, శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వాహన తనిఖీలు, మూవింగ్ టీమ్స్ పని తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ముగ్గురు సిఐలను నియమించామన్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 కేసుల్లో 25మందిని అరెస్టు చేసి, 12 వాహనాలను, 160 పశువులను సీజ్ చేశామని తెలిపారు. గతంలో కేసులు గల పాత నేరస్తులపై నిఘా పెట్టడంతోపాటు మళ్లీ ఈ తరహా నేరాలకు పాల్పడకుండా వారిని బైండోవర్ చేశామన్నారు. పశువుల విక్రయాలు జరిగే సంతలను కూడా మూయించివేశామన్నారు. కొంతమంది వ్యక్తులు కాలి నడకన పశువులను రవాణ చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బక్రీద్ పండగ ప్రశాంతయుతంగా ముగిసే విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని, భద్రత ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు.


