నేర నియంత్రణకు డ్రోన్‌ వినియోగం కీలకం | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు డ్రోన్‌ వినియోగం కీలకం

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

నేర నియంత్రణకు డ్రోన్‌ వినియోగం కీలకం

విజయనగరం క్రైమ్‌ : నేరాల నియంత్రణకు డ్రోన్‌ వినియోగం అత్యంత కీలకమని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌ బ్యారెక్స్‌ లో ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మంగళవారం మహిళా పోలీసు కానిస్టేబుల్స్‌కు డ్రోన్‌ వినియోగించడంలో శిక్షణను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణకు డ్రోన్స్‌ వినియోగం క్రియాశీలకంగా మారనున్నందున డ్రోన్స్‌ ఆపరేటర్లుగా మహిళా పోలీసు కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలో ప్రతి పోలీసు స్టేషన్‌ కు ఒక డ్రోన్‌ ను ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుస్టేషన్‌ పరిధిలో డ్రోన్‌ ను వినియోగించేందుకు, డ్రోన్‌ ఆపరేటింగ్‌ విధానం పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీసు స్టేషను నుంచి టెక్నాలజీ వినియోగం పట్ల అవగాహన కలిగిన మహిళా పోలీసు కానిస్టేబుల్స్‌ను ఎంపిక చేసి, నిపుణుల పర్యవేక్షణలో వారికి డ్రోన్‌ ఆపరేటర్లుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ఓపెన్‌ డ్రింకింగ్‌, గంజాయి, పేకాట, కోడి పందాల నియంత్రణకు, క్రౌడ్‌, ట్రాఫిక్‌ పర్యవేక్షణ, పండగలు, ముఖ్య నాయకుల భద్రత, ముఖ్యమైన బందోబస్తుల్లో డ్రోన్స్‌ ను జిల్లాలో వినియోగిస్తామన్నారు. ఒక ప్రాంతంలో ఉండి నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలకు లేదా నాలుగు కిలో మీటర్ల పరిధి వరకు డ్రోన్‌ పంపి, ఆయా ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. డ్రోన్స్‌ ఆపరేటింగ్‌ విధానంపై అవగాహన కలిగిన నిపుణుల పర్యవేక్షణలో మహిళా పోలీసు కానిస్టేబుల్స్‌కు డ్రోన్స్‌ వినియోగించి, ఒక ప్రాంతపై ఎలా నిఘా ఏర్పాటు చేయాలి, వీడియోలు, ఫొటోలు ఏవిధంగా తీయాలన్న విషయాలపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement