దత్తిరాజేరు: గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా ప్యాపారాలు సాగించే పశు రవాణా వ్యాపారంపై పోలీసులు వారం రోజులుగా ఉక్కు పాదం మోపడంతో వ్యాపారుల గుండెల్లో గుబులు పుడుతోంది. గజపతినగరం సర్కిల్ పరిధిలో ఉన్న దత్తిరాజేరు,గజపతినగరం,ఎస్ బూర్జవలస, బొండపల్లి, ఆండ్ర పోలీస్ స్టేషన్‌ల పరిసర ప్రాంతాల నుంచి ఒక్క పశువు కూడా అక్రమంగా తరలకుండా 19 కూడళ్ల వద్ద సిబ్బందిని రాత్రి పగలు బందోబస్తు పటిష్టంగా ఉంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ రవాణా జరగకుండా చేస్తున్నట్లు గజపతినగరం సీఐ సన్యాసినాయుడు చెప్పారు. గతంలో నిబంధనలు బేఖాతరు చేసి అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణా సాగించిన వ్యాపారులకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడడంతో ఇది రాజకీయ కోణంలో జరిగిందా? నిజంగా పశువుల అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేస్తున్నారా? అనే ఆలోచనలో గజపతినగరం సర్కిల్ పరిధిలోని ప్రజలు పడ్డారు.ఒడిశా నుంచి రోజూ గజపతినగరం సర్కిల్ పరిధి మీదుగా వేలాది పశువులు అక్రమంగా తరలి పోతున్నా పట్టిచుకోని అదికారులు ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎంతకాలం ఈ తనిఖీలు సాగుతాయో వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు.


