ఆండ్ర పనుల్లో.. కమీషన్ల గాండ్రింపు..! | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర పనుల్లో.. కమీషన్ల గాండ్రింపు..!

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

కమీషన్ల పనులకే పెద్దపీట..

రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలి

ఆర్‌ఎల్‌ 1, 2 కాలువల కింద పంటలు పండక నష్టపోతున్నాం. కాలువలు తెగిపోతే ప్రభుత్వ సాయం లేక మేమంతా చందాలు వేసుకుని పైపులు కొనుక్కున్నాం. రైతులకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలే తప్ప కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేలా అధికారులు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. ఎప్పుడు అడిగినా నిధులు లేవనే సాకు చెబుతున్నారు. – యస్‌.సత్యనారాయణ,

ఆర్‌ఎల్‌ 1, 2 ఆయకట్టు రైతు, లోతుగెడ్డ

చేసిన పనులేవీ?

వచ్చిన అరకొర నిధులతో రైతులకు రూపాయి ఉపయోగం లేకుండా చేశారు. ఎడమ కాలువ పూర్తిగా పూడికతో నిండిపోయింది. కాలువ మొదట్లో పనులు చేయకుండా ఎక్కడో పనులు చేసినట్లు చూపి నిధులు కాజేశారు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. – పడాల గంగునాయుడు,

ఎడమ కాలువ నీటి సంఘం చైర్మన్‌

రూ.20 కోట్లు అవసరం

ఆండ్ర రిజర్వాయర్‌ పూర్తిస్థాయి ఆధునీకరణకు సుమారు రూ.20 కోట్ల వరకు నిధులు అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు, నివేదికలు పంపించాము. ప్రస్తుతం వచ్చిన అరకొర నిధులతో పనులు పూర్తి కావడం లేదు.

– రామునాయుడు, డీఈ, ఆండ్ర రిజర్వాయర్‌

మెంటాడ:

ఆండ్ర రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. వచ్చిన అరొకర నిధులతో కమీషన్ల వచ్చే పనులకే పాలకులు పచ్చజెండా ఊపుతున్నారు. తూతూ మంత్రంగా పనులుచేస్తూ నిధులను స్వాహా చేసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులపై రాజకీయ ముద్రవేసి గాండ్రిస్తున్నారు. ఫలితం.. రైతులకు ఏటా సాగు నీటి తంటాలు తప్పడం లేదు. మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాల పరిధిలోని 22 గ్రామాలకు చెందిన సుమారు 9,426 ఎకరాల ఆయకట్టుకు ఆండ్ర పాజెక్టు నుంచి వచ్చిన సాగునీరే ఆధారం. పొలాలకు నీరందించే కాలువ పనులను గాలికొదిలేసి, కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యమివ్వడంపై రైతులు మండిపడుతున్నారు. నిధులను కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు బిడ్డింగ్‌ లేదా కేటాయింపులు ఎవరికి దక్కినా, తెరవెనుక పనులు చేసేది మాత్రం స్థానిక మంత్రి ముఖ్యఅనుచరుడే కావడం గమనార్హం.

కాలువల్లో పూడికలు.. గండ్లు..

రిజర్వాయర్‌ పరిధిలో ఎడమ ప్రధాన కాలువ కింద 4,630 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్‌ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే కాలువ సుమారు ఐదున్నర అడుగుల లోతుకు, ఐదు అడుగుల మేర మట్టి, ఇసుకతో పూర్తిగా పూడిపోయింది. కాలువ పొడవునా నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు 4,796 ఎకరాల ఆయకట్టు కలిగిన కుడి ప్రధాన కాలువ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కాలువ పరిధిలోని ఆర్‌ఎల్‌ 1 కాలువ ప్రధాన కాలువ నుంచి కనీసం 300 మీటర్లు కూడా నీరు ముందుకు సాగడం లేదు. పూడికలతో నీరు ప్రవహించక ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయి. ఆర్‌ఎల్‌ 2 కాలువ గట్టు బలహీనంగా ఉండడంతో రైతులను ముంపభయం వెంటాడుతోంది. ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో చాలాసార్లు సొంత డబ్బులతోనే గండ్లు పూడ్చడంతోపాటు, పైపులు వేసి సాగునీటిని తరలిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. తరచూ ఎగువ ప్రాంతంలో కాలువలకు గండ్లు పడడంతో పంటలను నీరు ముంచెత్తుతోంది. ఈ నీటి మళ్లింపునకు రైతులు తరచూ గొడవలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు శివారు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఒక చోట నీరు అధికమై పంటలు పండక, మరోచోట నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కొందరు కాడివదిలి వలసపోతున్నారు.

ఆండ్ర రిజర్వాయర్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం అరకొరగా మంజూరు చేసిన రూ.3 కోట్ల నిధులతో తొలుత చేపట్టాల్సిన కాలువల మరమ్మతుల పనులను, పూడికతీతలను పూర్తిగా పక్కనబెట్టారు. ప్రాజెక్టు చైర్మన్‌కు సైతం సమాచారం లేకుండా, అధికార పార్టీ నేతలు తమకు కావలసిన చోట మాత్రమే అరకొరగా తుప్పలు నరకడం వంటి నామమాత్రపు పనులు చేసి నిధులు డ్రా చేసుకున్నట్టు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రాజెక్టును గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గతంలో ఇద్దరు మంత్రులు హామీలు గుప్పించారు. ఆ మాటలు నేటికీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. తమ సమస్యలపై, నిధుల దుర్వినియోగంపై స్థానిక రైతులు నిలదీస్తే.. అధికార పార్టీ నాయకులు దానికి రాజకీయ రంగు పులుముతూ, రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులను వివరణ కోరితే.. ‘ప్రభుత్వానికి నివేదికలు పంపాం’ అంటూ గత మూడేళ్లుగా ఒకే పల్లవి అందుకుంటున్నారే తప్ప కంటితుడుపు చర్యలు కూడా చేపట్టడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement