టీడీపీకి డబుల్‌ ధమాకా! | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి డబుల్‌ ధమాకా!

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

మరి ఇప్పుడు భూమిని కొట్టేసేందుకేనా?

సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజలు అధికారం ఇచ్చారు.. ఐదేళ్లపాటు అడిగేవారు ఇంకెవరు అన్న రీతిన చంద్రబాబు సర్కారు ముందుకు సాగుతోంది. ప్రజాసంక్షేమాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో అలసత్వం ప్రదర్శస్తున్న చంద్రబాబు.. తమ పార్టీ కార్యాలయాలకు మాత్రం ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టడం, దీనికోసం వెంటవెంటనే జీఓలు జారీచేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. విజయనగరంలో పార్టీ కార్యాలయానికి గతంలో ఎకరా స్థలం కేటాయించిన చంద్రబాబుసర్కారు.. ఇప్పుడు దానిని రెండెకరాలకు పెంచడం, అది కూడా ఎకరానికి వార్షిక అద్దె రూ.1000కే ఖరీదైన స్థలం కేటాయించడంపై జనం విస్తుపోతున్నారు. అధికారం అండతో భలే చౌకబేరమంటూ ఎద్దేవాచేస్తున్నారు.

విజయనగరంలో టీడీపీకి ప్రత్యేకంగా కార్యాలయం లేదు. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు నివసిస్తున్న అశోక్‌ బంగ్లానే పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమమైనా అక్కడ నిర్వహించాల్సిందే. వేరే కార్యాలయం తెరిచేందుకు ఇంతవరకు నాయకులు సాహసించలేదు. అశోక్‌ బంగ్లాను కాదని ఎవరైనా ప్రత్యేక పార్టీ కార్యాలయం ఏర్పాటుకు పూనుకుంటే బంగ్లా రాజకీయాలకు బలిపశువు కావాల్సి వస్తుందన్న భయం నాయకులను వెంటాడుతోంది. గతంలో ఇదే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బంగ్లా రాజకీయాలను తట్టుకోలేక విజయనగరం నియోజకవర్గం పేరిట వేరే పార్టీ కార్యాలయాన్ని విజయనగరంలో పెట్టారు. ఆమె నిర్ణయం బంగ్లా నేతలకు రుచించలేదు. దీంతో గీతను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమను ధిక్కరించి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని పెట్టిన గీత కెరీర్‌ను ముగించేశారన్న అపవాదు లేకపోలేదు.

● గత కొన్నేళ్లుగా పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిమిడి నాగార్జున సైతం ప్రత్యేకంగా కార్యాలయాన్ని పెట్టాలని నిర్ణయించారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే, బంగ్లా రాజకీయాలకు భయపడి ప్రత్యేక కార్యాలయం ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తరహాలో తనకు ఎక్కడ రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తారన్న భయంతో ఆ నిర్ణయానికి స్వస్తి పలికినట్లు సమాచారం.

టీడీపీలో బంగ్లారాజకీయాలు సాగుతున్న వేళ పార్టీకి ప్రత్యేకంగా రెండెకరాల భూమిని గాజులరేగ గ్రామంలోని సర్వే నంబర్‌ 1/88లో 98 సెంట్లు, సర్వే నంబర్‌ 6/47లో 1.02 ఎకరాలు కేటాయించడం చూస్తుంటే జిల్లా వాసుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి 2018 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అయ్యన్నపేట గ్రామ పరిధిలోని కణపాకలో టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సర్వే నంబర్‌ 15/1పిలో ఎకరా స్థలం కేటాయించినప్పటికీ అప్పుడు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. రెండెకరాల భూమిని కేటాయిస్తూ గత ఏడాది మార్చి 11న ప్రభుత్వం జీఓ నంబర్‌ 84 జారీ చేసింది. పార్టీకి వేరే ఆఫీస్‌ అనే ఆలోచన లేని తరుణంలో మరి ఇలా రెండెకరాల భూమి ఎందుకు ? అంటే పార్టీకి ఆస్తులు కల్పించడమే లక్ష్యంగా ఇలా భూములు కేటాయించుకుంటున్నారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. మరోవైపు పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసి అక్కడ కార్యకలాపాలు సాగిస్తే బంగ్లా నేతలు ఎంతవరకు ఒప్పుకుంటున్నారన్న చర్చ సాగుతోంది.

2018లో ఎకరా భూమి... 2025లో రెండెకరాలకు

పెంపు

వార్షిక అద్దె రూ.1000కే స్థలం కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు

గాజులరేగ వద్ద పార్టీ

కార్యాలయం నిర్మాణానికి అడ్డుగోలుగా కేటాయింపులు

భూమి కొట్టేసేందుకే ఈ

ఎత్తుగడ అంటూ ఆరోపణలు

Advertisement
 
Advertisement
Advertisement