జమ్మూ నారాయణపురం రోడ్డులో నిలిచిన ట్రాఫిక్
● నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● నిలిచిన విద్యుత్ సరఫరా ● రాకపోకలకు అంతరాయం
విజయనగరం/గంటస్తంభం/తెర్లాం/గుర్ల:
విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడిగుల శబ్దాలతో జనం భీతిల్లిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్ల రేకులు, హోర్డింగ్‌లు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాకపోకలు స్తంభించాయి.
● విజయనగరం దాసన్నపేట ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.
● తెర్లాం మండలంలోని తెర్లాం–ఆమిటి రోడ్డులో పలుచోట్ల చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. వీఆర్వో డి.రాము ఇచ్చిన సమాచారం మేరకు మండల ఇన్‌చార్జి తహసీల్దార్ గొంగాడ సత్యనారాయణ, తెర్లాం ఎంపీటీసీ సభ్యుడు జి.ఆనందరావు పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలు క్రమబద్ధీకరించారు.
● గుర్ల మండలం చింతలపేటలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం పడిపోయింది. మన్యపురిపేటలో షెడ్‌పై చెట్టు పడింది. గరివిడి –విజయనగరం ప్రధాన రోడ్డుపై గుర్ల వద్ద తాటిచెట్లు పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
● విజయనగరం అయ్యకోనేరు ఉత్తర, దక్షిణ నాలా ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో అంధకారం అలముకుంది. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో చెట్టు రహదారికి అడ్డంగా పడిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


