జామి: మండలంలోని భీమసింగి కొత్తవలస వెళ్లే రోడ్డులో ఉన్న జేఏ సాగునీటి చానల్‌పై వంతెన నిర్మాణం వివాదస్పదంగా మారింది. అన్నమరాజుపేట , భీమసింగి రైతులు నిర్మాణాన్ని మంగళవారం అడ్డుకున్నారు. కాలువపై వంతెన నిర్మిస్తే సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందన్నారు. వంతెన నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నమరాజుపేట పీఏసీఎస్ అధ్యక్షుడు అప్పలరాజు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎన్నింటి శేషు, పలువురు రైతులు కోరారు. ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ జేఈ సంతోష్‌కుమార్ స్పందిస్తూ వంతెన నిర్మాణానికి సంబంధిత వ్యక్తులు ఉన్నతాఽధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నారని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.
గందర గోళంగా రీసర్వే
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో రీసర్వే పేరుతో రైతులను ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టేస్తోందని విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర విమర్మించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో లోక్‌సత్తా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నపాటి భూ సమస్యలు కూడా పరిష్కారంకాక రైతులు రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గ్రామాల్లో సర్వే నంబర్లు, జాయింట్ ఎల్‌పీఎంల సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరచూ జీఓలు జారీ చేస్తున్నా రైతులకు ప్రయోజనం లేకపోతోందన్నారు. రెవె న్యూ శాఖలో సిబ్బంది కొరత కూడా సమస్యలకు కారణమని తెలిపారు. మరో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ కేఆర్‌డీ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లలో రైతులు ఫిర్యాదులు ఇస్తున్నా పరిష్కారం కనిపించడం లేదన్నారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సదస్సులో లోక్‌సత్తా నేతలు, పౌర సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ సదస్సు రేపు
పార్వతీపురం రూరల్: నూతన విద్యా ప్రణాళికలో భాగంగా 6, 7 తరగతుల భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలపై ప్రయోగాత్మక బోధన కోసం జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయులకు బుధవారం అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ‘మన్యం కళావేదిక’ ఆడిటోరియంలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమానికి కలెక్టర్‌ను ఫోరం సభ్యులు ఆహ్వానించారు.


