ముగ్గురు తహసీల్దార్లకు ఉద్యోగోన్నతి
● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. స్థానిక పోలీస్ బ్యారెక్స్‌లో ముస్లిం మతపెద్దలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియువతంగా పండగ నిర్వహించుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మసీదుల వద్ద డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, వన్‌టౌన్ సీఐ ఆర్వీఆర్‌కే చౌదరి, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, కంట్రోల్ రూం సీఐ వైకుంఠరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా తాత్కాలిక ఉద్యోగోన్నతులు లభించాయి. 2025–26 అదనపు ప్యానెల్ సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 29 మంది తహసీల్దార్లు, ఒక సెక్షన్ ఆఫీసర్‌కు డిప్యూటీ కలెక్టర్లుగా తాత్కాలిక (అడ్‌హాక్) ప్రమోషన్లు కల్పిస్తూ రెవెన్యూ (సర్వీసెస్–1) శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ సర్వే ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జరిగిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం సిఫార్సుల ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పించింది. ఉద్యోగోన్నతి పొందిన వారిలో జిల్లాకు చెందిన గంట్యాడ మండల తహసీల్దార్ పన్నూరు నీలకంఠేశ్వర రెడ్డి, చీపురుపల్లి తహసీల్దార్ దరిశిల ధర్మరాజు, చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారిణి రేలంగి ఈశ్వరమ్మ ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందిన అధికారులు 15 రోజుల్లోగా కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని, లేకపోతే ప్రమోషన్ హక్కు కోల్పోతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


