విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వేలైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి పనులపై సమీక్షించారు. వివిధ దశల్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను నిర్ణేత గడువులోగా పూర్తిచేసి, ప్రాజెక్టులు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.


