● సచివాలయం వద్ద కౌలు రైతుల ఆందోళన
● చివరకు వేలంపాట వాయిదా
గజపతినగరం రూరల్: మండలంలోని పీ.ఎస్.ఆర్ పురం గ్రామంలోని 47 ఎకరాల దేవదాయశాఖ భూములకు మంగళవారం నిర్వహించిన కౌలు వేలంటపాట ఉద్రిక్తతగా మారింది. భూములను సాగుచేస్తున్న 19 మంది కౌలు రైతులు వేలంపాట నిర్వహించిన సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 70 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నామని, ఏటా ఠంచన్‌గా దేవదాయ శాఖకు కౌలు చెల్లిస్తున్నామని, వేలంపాట లేకుండా తమకే కౌలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్‌ప్రసాద్, శ్రీరామ్‌లు మాట్లాడుతూ ఇన్‌చార్జి ఈఓలు ఉండడం వల్ల ప్రతి మూడేళ్లకు నిర్వహించాల్సిన వేలంపాట 12 ఏళ్లుగా నిర్వహించలేదని, వేలంపాటకు రైతులు సహకరించాలని కోరారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు సైతం సర్దిచెప్పారు. వేలంపాటలో పాల్గొని భూములను కౌలుకు తీసుకోవాలని సూచించారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో మరో పది రోజులు గడువు ఇస్తామని, వేలంపాట పాడిన వారికే భూములను కౌలుకు ఇస్తామని చెబుతూ దేవదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు.


