ఇంటర్ పరీక్షలకు వేళాయె..
నేటి నుంచి పరీక్షలు హాజరు కానున్న 39,037 మంది విద్యార్థులు 18 జోన్ల పరిధిలో 66 పరీక్ష కేంద్రాల ఏర్పాటు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి మొదటి సంవత్సరం విద్యార్థుల నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్ : ఆర్‌ఐఓ
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష లు సోమవారం నుంచి మార్చి 24వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియెట్ పరీక్షలను 39,037 మంది విద్యార్థులు రాయనున్నారు. రోజు విడిచి రోజు మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షకు జిల్లా వ్యా ప్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 18 జోన్లు, 20 స్టోరేజ్ పాయింట్లు, 16 కస్టోడియన్లు, 66 చీఫ్ సూపరింటెండెంట్లు, 66 డిపార్టుమెంట్ అధికారులు, మూ డు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, వెయ్యి మంది ఇన్విజిజేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీస్‌లను నిరోధించడానికి వివిధ దశల్లో ఏర్పాటు పక్కాగా చేపట్టారు.
30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి
హాజరు కావాలి
ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్న ఈ పరీక్షలకు 30 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లాలి. స్పష్టమైన కారణం ఉంటేనే 9 గంటల తరువాత మరో 15 నిమిషాల వరకు అనుమతి ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల్లోనే ఉండాలి. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ముఖ్య పర్యవేక్షకులు, విభాగాధికారులు ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని ఆదేశాలు ఉన్నాయి. ఇది డిజిటల్ చీటింగ్‌ను నిరోధించడంలో కీలకం. ముఖ్యంగా గడిచిన సంవత్సరాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్నొన్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం 66 కేంద్రాలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులో ఉంచారు.
32 పేజీల జవాబు పత్రం
మొదటి సంవత్సర ఇంటర్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కొత్తగా ఈ ఏడాది నుంచి 32 పేజీల జవాబు పత్రం ఉంటుందని ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. గణితం, భౌతికశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, వాణిజ్యశాస్త్రం సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్ అందజేస్తారని గత సంవత్సరాలతో పోలిస్తే మరిన్ని వివరణలు రాయడానికి అవకాశంగా పేజీలను పెంచినట్లు తెలిపారు. ఈ మార్పు విద్యార్థుల ఆన్సరింగ్ నాణ్యతను పెంచుతుందని చెప్పారు. అదనంగా అన్ని ప్రశ్న పత్రాలు 100 మార్కులకు మార్చినట్లు బోర్డు ప్రకటించింది. పరీక్ష కేంద్రాల్లో పరీక్ష సమయంలో 24 పేజీలు కాకుండా 32 పేజీలున్న బుక్‌లెట్‌నే తీసుకోవాలని సూచించారు.


