సాయం కోసం చిన్నారి ఎదురుచూపు
● చిన్నారికి కిడ్నీ వ్యాధి ● మంచానికే పరిమితం ● ఆదుకోవాలని వేడుకోలు
రేగిడి: అందరి చిన్నారుల్లా చక్కగా ఆడుకోవాల్సిన వయసు ఆ బాలికది. కానీ అనారోగ్యం చేసింది. బాగు చేయించుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత స్థోమత లేని ఆ తల్లిదండ్రులు బిడ్డను చూస్తూ కన్నీరుమున్నీరుగా విలిపిస్తూ తమ బిడ్డను దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. ఆ చిన్నారే రేగిడి మండలం సంకిలి గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పిన్నింటి హారిక. ఇటీవల పాప అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పాపకు కిడ్నీ పాడైందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. కూలీ చేసుకొని జీవించే తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచలేదు. ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని కోరారు. అయినా అదనంగా మరో రూ.2లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తల్లిదండ్రులైన సూర్యనారాయణ, భవానీలకు తెలిపారు. దీంతో వారు ఆదివారం విలేకరుల ముందు తమ పాప భవిష్యత్‌ను కాపాడాలని, దాతలు ఆదుకోవాలని వేడుకున్నారు. కూలీ పనులు చేసుకొని తమ ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ జీవితాన్ని కష్టాల నడుమ నడుపుతున్నామని ఇప్పుడెలా అంటూ దాతల సాయం కోసం అర్జించారు. చిన్నారి హారిక సంకిలి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. పాడైన కిడ్నీ ఇన్‌ఫెక్షన్ కావడంతో వెంటనే తొలగించకుంటే రెండో కిడ్నీ కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దాతలు పెద్ద మనసుతో తమ పాపను ఆదుకోవాలని కోరారు.
సాయం చేసే దాతలు 99082 39765
నంబరుకు ఫోన్‌పే చేయాలని కోరారు.


