ముగిసిన సబ్ జూనియర్స్ ఖోఖో పోటీలు
● బాలుర విభాగంలో కుమిలి, బాలికల విభాగంలో కెల్ల విజయం
విజయనగరం: కబడ్డీ, ఖోఖో పితామహుడు, స్వర్గీయ వై.భగవాన్‌దాస్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన జిల్లాస్థాయి సబ్‌జూనియర్ బాలబాలికల ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. భగవాన్‌దాస్ స్పోర్ట్స్ క్లబ్, జిల్లా ఖోఖో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో కుమిలి జట్టు ప్రథమస్థానంలో నిలవగా.. కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, పూల్‌బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, నేషనల్ స్కూల్ జట్లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కెల్ల జట్టు విజేతగా నిలిచింది. తదుపరి స్థానాల్లో గంట్యాడ, పూసపాటిరేగ, పూల్‌బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల జట్లు నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భగవాన్‌దాస్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు రంగారావు దొర, ఆవాల కృష్ణారావు, చిన్నంనాయుడు, పీఎస్‌ఎన్‌వర్మ, అచ్యుతరావు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమలనాభరావు, వరలక్ష్మి, హరీష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముగిసిన సబ్ జూనియర్స్ ఖోఖో పోటీలు


