
సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
● పీజీఆర్‌ఎస్‌కు 188 వినతులు
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే వినతులను లాగిన్‌లో నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు లాగిన్‌లో చూడాలని చూడవలసిన కాలమ్‌లో ఎప్పుడు చూసినా సున్నా పరిష్కారం కనపడాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ లో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్‌కు 188 వినతులు అందాయి. కలెక్టర్‌తోపాటు జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్‌డీసీలు మురళి, ప్రమీలా గాంధీ, వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 36 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ 36 ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు