
పోస్టల్ బీమా ఏజెంట్ల నియామకానికి ఆహ్వానం
విజయనగరం టౌన్: విజయనగరం డివిజన్ తపాలాశాఖ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కొల్లూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 29 వరకూ అభ్యర్థులు తమ బయోడేటా, ఫొటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు. నియామకం పూర్తయిన ఏజెంట్లకు పాలసీననుసరించి కమీషన్ ఇవ్వనున్నామని, నెలవారీ జీతం ఉండదని స్పష్టం చేశారు. 5వేల జనాభాకు తక్కువగా ఉన్న ప్రాంతంలో పదోతరగతి, 5వేల జనాభాకు పైన ఉన్న ప్రాంతంలో ఇంటర్ ఉత్తీర్ణులై, మార్కెటింగ్, ఇన్సూరెన్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థులు కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.