
● సమసిన వివాదం
రామభద్రపురం: మండలంలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ గోదాం వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి మండలం పరిధిలో గల జన్నివలస గ్రామానికి చెందిన ముచ్చుపల్లి శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇదే విషయంపై మృతుడి కుటుంబసభ్యులు గోదాం యజమానికి సమాచారం ఇవ్వగా తనకేమీ తెలియదన్నట్లు యాజమాన్యం కనీసం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించ నివ్వకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. అలాగే గ్రామపెద్దలతో పాటు ప్రజలు సుమారు 200 మందితో కలిసి జీవనాధారమైన ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. సిమెంట్ గోదాంలో పనిచేస్తూ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై వి. ప్రసాదరావుతో పాటు జన్నివలస గ్రామ పెద్దలు, రామభద్రపురం గ్రామ పెద్దలు, రామభద్రపురం సిమెంట్ వ్యాపారులు సిమెంట్ గోదాం యజమానితో మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని చర్చించారు. యజమాని ససేమిరా అంటూ పరిహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో కార్మిక యాక్ట్ ప్రకారం యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించడంతో దిగొచ్చిన యాజమాన్యం విద్యుదాఘాతంతో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు శాంతించి వివాదం ముగించారు. వెంటనే మృతదేహాన్ని ిపోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.
గోదాం యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం
మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ
మృతిపై సమాచారం ఇచ్చినా
స్పందించని యాజమాన్యం
మృతదేహం కదిలించేది లేదని
కుటుంబసభ్యుల మొండి పట్టు