
గణేష్ ఉత్సవాలకు నిబంధనలు తప్పని సరి
విజయనగరం క్రైమ్: గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇప్పటి నుంచే బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్‌జిందల్ ఆదేశించారు. గణేష్ మంటపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఉత్సవ కమిటీలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీపీవోలో జరిగిన సమావేశంలో ఎస్పీ అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో ట్రయల్ రన్ కేసులపై దృష్టి పెట్టాలని ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరుపై కోర్టు కానిస్టేబుల్‌తో పాటు ఎస్సైలు, సీఐలు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో బాధితురాలి వయస్సు నిర్ధారించాలంటే కచ్చితంగా తహసీల్దార్ లేదా పంచాయతీ అధికారి నుంచి అధికరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కేసు తీవ్రతను బట్టి ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించిన కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇక స్కూల్స్, కళాశాలల్లో ఈగల్ క్లబ్స్, శక్తి వారియర్ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆయా కళాశాలల్లో విద్యార్థినులు ఆత్మ రక్షణ పొందేందుకు స్పెషల్ ఇన్‌స్ట్రెక్టర్స్‌ను పెట్టుకోవాలని సూచించారు. రాత్రి పూట గస్తీ తిరిగే సిబ్బంది రెండు షిప్టుల్లో పనిచేయాలన్నారు. టౌన్ న్యూసెన్స్ యాక్టును విధిగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలని, ఫైనాన్షియల్ లావాదేవీల కేసుల్లో కూడా సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు
అనంతరం పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించి గంజాయి అక్రమాలు అరికట్టడం, చోరీలు నియంత్రించడం, లోక్ అదాలత్‌లో కేసులను త్వరితంగా పరిష్కరించిన సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యారెడ్డి, రాఘవులు, గోవింద, వీరకుమార్, న్యాయసలహాదారు పరశురామ్, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
డీపీఓలో నేర సమీక్షా సమావేశం