
గిరిజనుల డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?
బొబ్బిలి రూరల్: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇంకా ఎన్నాళ్లు ప్రమాదకరంగా గిరిజనులు ఈ డోలీ మోతలతో ఆస్పత్రుల్లో చేరాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె పుణ్యవతి పాలకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త బట్టివలస గిరిజన గ్రామానికి చెందిన నిండు గర్భిణి మంగళవారం డోలీ మోతతో పిరిడి పీహెచ్‌సీలో చేరిన విషయం విదితమే.బుధవారం పీహెచ్‌సీలో తల్లీబిడ్డలను పుణ్యవతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిలో మైదాన ప్రాంతాలకు పెద్దపీట వేసి గిరిజన గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, ఆరోగ్యం, విద్యను పాలకులు అందించలేకపోతున్నారని విమర్శించారు. బట్టివలస గిరిజన గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రి సంధ్యారాణికి ఇవేమీ పట్టడం లేదన్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాలకే ఇటువంటి దుస్థితి వస్తే గిరి శిఖరాలపై నివసిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, డోలీ మోతల్లో తల్లీబిడ్డలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనుకూలమైన వ్యక్తులకు కోట్లరూపాయల కాంట్రాక్టులను అప్పగించి మైదానప్రాంతాల్లో రోడ్లు వేసుకున్నారని, గిరిజన గ్రామాలపై పూర్తి వివక్షచూపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో గిరిజన మహిళలను ఏకం చేసి ఆందోళన బాటపడతామని ప్రభుత్వాన్ని, పాలకులకు హెచ్చరించారు.
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పుణ్యవతి