
సాయి స్థూపం శంకుస్థాపన
విజయనగరం టౌన్: కాశీవిశ్వేశ్వర సహిత శ్రీ షిర్డీసాయి దక్షిణాభి ముఖ అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద 40 అడుగుల సాయి స్థూపానికి శనివారం శంకుస్ధాపన నిర్వహించారు. స్థానిక రీమాపేట ఉమామహేశ్వరనగర్‌లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, షిర్డీసాయి సేవక్ సంఘ్ ఉప్పల బాపిరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా 40 అడుగుల సాయి స్థూపం నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్థూపంపై కలువ పువ్వులో ఆశీనులైన సాయి నిలువెత్తు విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందన్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులు రాసిన సాయినామకోటి పుస్తకాలను, నవధాన్యాలతో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.