భక్తి గీతాలకు వికృత నృత్యం
● సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
● మనస్తాపం చెందిన క్రైస్తవ విశ్వాసులు
● వెంకంపేటలో ఉద్రిక్తత
పార్వతీపురం రూరల్: సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి దొర్లింది. భోగి మంటల సాక్షిగా కొందరు యువకులు చేసిన వికృత చేష్టలు రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీశాయి. భక్తి పాటలను అపహాస్యం చేస్తూ చిందులేయడం, ఆపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పార్వతీపురం మండలంలోని వెంకంపేట గ్రామంలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
గ్రామంలోని తెలగ వీధి రామ మందిరం వద్ద మంగళవారం భోగి మంటలు వేసేందుకు కొందరు స్థానిక యువకులు సిద్ధమయ్యారు. అయితే, ఉత్సాహం హద్దులు దాటింది. అక్కడ ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సుల్లో క్రైస్తవ భక్తి గీతాలను ప్లే చేస్తూ.. ఆ పాటలను, దైవాన్ని వెక్కిరించే రీతిలో వికృత నృత్యాలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
నిలదీత..వాగ్వాదం
తమ ఆరాధ్య దైవాన్ని కించపరిచేలా ఉన్న ఆ వీడియోలను బుధవారం గమనించిన స్థానిక క్రైస్తవ విశ్వాసులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరుసటి రోజు బుధవారం సాయంత్రం రామ మందిరం వద్దకు చేరుకుని, ఇలాంటి చర్యలు సమంజసం కాదని సదరు యువకులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఈ గొడవను గమనించిన స్థానికులు వెంటనే ’డయల్ 100’కు సమాచారం అందించారు. తమను కులం, మతం పేరుతో దూషించారంటూ క్రైస్తవ విశ్వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు
పోలీసులు వెంటనే స్పందించి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి శుక్రవారం గ్రామంలో స్వయంగా దర్యాప్తు నిర్వహించారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం వెల్లడించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
భక్తి గీతాలకు వికృత నృత్యం


