ఉత్సాహంగా ఎడ్ల పరుగు ప్రదర్శన
వేపాడ: సంక్రాంతి సంబరాలు పూర్తి కాగానే గ్రామాల్లో తీర్థాల సందడి ప్రారంభమైంది. మండలంలోని కృష్ణారాయుడుపేట గ్రామంలో కృష్ణారాయుడు స్వామి తీర్థమహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించారు. ఈ పోటీల్లో విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 10 జతల ఎడ్లు పాల్గొన్నాయి. వాటిలో వావిలపాడుకు చెందిన పరదేశమ్మ ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి రూ.పదిహేను వేలు, రెండోస్థానంలో నిలిచిన దేవరాపల్లికి చెందిన వారాది జ్ఞానప్రసన్న ఎడ్లు రూ.పదమూడువేలు, అజనగిరికి చెందిన పరవాడ నాయుడు ఎడ్లు రూ.పదివేలు, నాల్గో స్థానంలో నిలిచిన వావిలపాడుకు చెందిన గండి వెంకటరావు ఎడ్లు రూ.ఎనిమిదివేలు చొప్పున నగదు బహుమతులు సాధించాయి. ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సాయంత్రం మహిళల కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


