కడితే రూ.వేలు..కొడితే లక్షలు
విజయనగరం: పందెం కోడి కాలికి కట్టే చూసేందుకు చిన్నగా ఉన్నా..తగిలితే రక్తం ధారలై పారుతుంది. దెబ్బతగిలిన కోడి క్షణాల్లో కుప్పకూలిపోతోంది. కోడి పందాల బరుల్లో వాటి పాత్ర ఎంతో కీలకం. సంక్రాంతి నేపథ్యంలో ప్రతి ఊరిలోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది.
విరగదు వంగదు..
కోడి కత్తులను ఆరు అంచెల్లో సాన పెడతారు. విరిగి పోకుండా, మొన వంగకుండా ఉండాలంటే ఎంతో గట్టిదనం అవసరం. అందుకే భారీ వాహనాల చక్రాల బేరింగుల్లో వినియోగించే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వాటిని తయారు చేస్తారు. దీనికి అత్యంత గట్టిదనం వచ్చేందుకు ఆరుసార్లు కొలిమిలో కాల్చుతారు.
కట్టే వారే ముఖ్యం..
సంక్రాతి కోడి పందాల బరుల్లో పుంజు కాళ్లకు కత్తులు కట్టేవారికి ఎంతో గిరాకీ ఉంటుంది. పండగ నాలుగు రోజులు వారికి మంచి డిమాండ్. కత్తి కట్టడంలోనే పందెం ఆధారపడి ఉంటుందని భావిస్తారు. పందెం పుంజు కుడికాలి చిటికెన వేలికి కత్తి కడతారు. పందెం జరుగుతున్నంత సేపూ పుంజు కాలికి కత్తికట్టే వ్యక్తి గమనిస్తూనే ఉంటాడు. విరిగినా, దిశ మారినా పందెం నిలిపి కత్తిని సరిచేసి మళ్లీ ప్రారంభిస్తారు. పందెం గెలిస్తే రూ. లక్షలు చేతులు మారుతాయి. అందుకే వారికి రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు నిర్వాహకులు ముట్టజెబుతారు.
రోజుకు పది కత్తులు మాత్రమే..
ఒక వ్యక్తి రోజుకు 5 నుంచి 6 కత్తుల వరకు మాత్రమే తయారు చేయగలడు. అందుకే సంక్రాంతి కోసం ఏడాది పొడవునా తయారు చేస్తారు. గతంలో వాటి ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.1000 వరకు ధర పలుకుతోంది. ముడి ఇనుమును చైన్నె, విజయవాడ, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. ఒక కత్తి ఒక పందానికి మాత్రమే వినియోగిస్తారు.
కోడి పందాల బరుల్లో కత్తులే కీలకం


