ఘనంగా బోనాల పండగ
బలిజిపేట: తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు సజీవంగా ఉంటున్నాయి. దీనికి ప్రాంతీయ భేదాలు లేవు. తెలంగాణలో నిర్వహిస్తున్న బోనాల పండగ ధోరణిలో ఆంధ్రాలోని ఒక మారుమూల గ్రామంలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. బలిజిపేట మండలంలోని మిర్తివలస గ్రామంలో మూడు తరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న బోనాల పండగను సంక్రాంతి పర్వదినాన నిర్వహించారు. ఈ గ్రామంలో తెలగజాతి వారు ఎక్కువగా ఈ పండగను నిర్వహిస్తారు. వారిలో కుటుంబాల పరంగా గన్ను, గునపర్తి, మానం, శిగురుకోట, గంగు, గుండాపు కుటుంబాలవారు ఉన్నారు. వీరు కుటుంబాల పరంగా పేరంటాలను కొలుస్తారు.
భక్తి ప్రపత్తులతో ఎంకమ్మ పేరంటాలికి మొక్కులు
అందరికీ ఆరాధ్య దైవంగా ఉంటున్న ఎంకమ్మ పేరంటాలను అందరు భక్తిప్రపత్తులతో కొలుస్తారు. 5కుండలకు పసుపు, కుంకుమలు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించి బోనాలుగా పిలుస్తారు. కుటుంబాలపరంగా వారివారి ఇళ్లలో వాటిని ఉంచి 5కుండలలో కలగాయకూర, పరమాణ్ణం, మైదాపిండి అట్లు, అరిసెలు, అంటిపండ్లు వేసి బోనాలను పూజించి వారివారి ఇళ్లనుంచి బయలుదేరి గ్రామం శివారున ఉన్న ఎంకమ్మపేరంటాల వద్దకు వెళ్లి భక్తిప్రపత్తులతో మొక్కి పూజలు చేశారు. బోనాలతో ఇంటినుంచి బయలుదేరేటప్పుడు ఇంటియజమానురాలు తలపై బోనాలను పెట్టుకోగా భర్త సంప్రదాయ పద్ధతుల్లో దుస్తులు ధరించి అనుసరించారు. బోనాలతో నడిచేవారి కాళ్ల కింద బట్టలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అటువంటప్పుడు ఆ దంపతులు కాళ్లను తాకుతూ వారిపై నుంచి దాటివెళ్తే ఎంతో పుణ్యమని భావించిన వారు నేలపై పడుక్కుని వారి ఆశీస్సులు పొందారు. చిన్నారులను పడుక్కోబెట్టి వారితో దాటిస్తారు. వారిని దాటుకుంటూ బోనాలతో పేరంటాల గుడికి చేరుకున్నారు. అక్కడ అందరు కలిసి ఎంకమ్మపేరంటాలను మొక్కుకుని బోనాలలో ఉంచిన ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. అక్కడే అన్నం, సాంబారుతో భోజనాలు చేసి వారి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుభకార్యాలుచేసేవారు ముందుగా పేరంటాలను కొలిచిన తరువాతే శుభకార్యాలు జరిపిస్తారు. కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా బోనాల పండగ
ఘనంగా బోనాల పండగ
ఘనంగా బోనాల పండగ
ఘనంగా బోనాల పండగ


