విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధం
గజపతినగరం : మండలంలోని గంగచోళ్లపెంట గ్రామం ఎస్పీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఎస్సీ కాలనీలో ఇల్లు లేక కొన్నాళ్లుగా రక్షిత మంచినీటి పథకం వద్ద ప్రైవేటు స్థలంలో పూరి గుడిసెను ఏర్పాటు చేసుకుని వర్రి పైడన్న తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. బుధవారం ఇంటిల్లిపాది పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో గుడిసె కాలిపోయింది. ప్రమాదంలో గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, దుస్తులు, రేషన్ కార్డుతో పాటు విలువైన దస్త్రాలు అన్నీ కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న చిన్నపాటి గుడిసె దగ్ధం కావడంతో తమ జీవనం ఎలాగంటూ పైడన్న కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.


