బీసీల పక్షపాతి వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీల పక్షపాతి వైఎస్‌ జగన్‌

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

జీవీఎంసీ మేయర్‌తో పాటు

120 వార్డుల్లో 95 సీట్లు బీసీలకే

93 శాతం బీసీలకు,

60 శాతం మహిళలకు అవకాశం

అధికారంలో ఉన్నప్పుడు బీసీలకోసం

వైఎస్‌ జగన్‌ పాటుపడ్డారు

మీడియాతో వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

సాక్షి,విశాఖపట్నం: చట్టసభలు, నామినేటెడ్‌ పదవుల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ఏకై క రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ అని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన బీసీల పక్షపాతి అని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు. ఆదివారం మద్దిలపాలెం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల అభ్యర్థుల ఖరారులో వైఎస్సార్‌సీపీకి అనూహ్య స్పందన లభించిందని, అభ్యర్థుల ఎంపికలో తీవ్ర పోటీ నెలకొందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సాధికారతకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసిందని కేకే రాజు వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలోని మొత్తం 120 వార్డులకు గాను ఏకంగా 95 స్థానాలను బీసీలకే కేటాయించామని చెప్పారు. మొత్తం స్థానాల్లో 93 శాతానికి పైగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన అభ్యర్థులకే అవకాశం కల్పించామని వివరించారు. అలాగే మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ 60 శాతం సీట్లను మహిళలకే కేటాయించినట్లు స్పష్టం చేశారు.

కూటమిపై ప్రజా వ్యతిరేకత

జీవీఎంసీలోని 120 వార్డులకు గాను పోటీ చేసేందుకు వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉత్సాహంతో ముందుకు వచ్చారని, దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ పార్టీ కార్యాలయం అధికార పార్టీలా ఎంతో సందడిగా మారిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను మూడు దశల్లో పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు విశాఖ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని కేకే రాజు మండిపడ్డారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే భయంతోనే అడ్డగోలుగా వార్డుల విభజన చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వార్డుల రిజర్వేషన్లను మార్చేశార ని ఆరోపించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి అభ్యర్థుల ఎంపికకు సరిపడా సమయం ఇవ్వకూడదనే దురుద్దేశంతోనే అత్యవసరంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ధ్వజమెత్తారు.

‘వైజాగ్‌ ఫర్‌ సేల్‌’గా కూటమి పాలన

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ‘వైజాగ్‌ ఫర్‌ సేల్‌’ అనే ధోరణితో ముందుకెళ్తోందని, దీనివల్ల విశాఖ నగర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ, అత్యధిక కార్పొరేటర్‌ సీట్లతో పాటు మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తాయని కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, సమన్వయకర్త దేవన్‌రెడ్డి, ముఖ్యనాయకులు పేడాడ రమణికుమారి, శ్రీనివాస్‌రెడ్డి, జహీర్‌ అహ్మద్‌, అంబటి శైలేష్‌, పీలా వెంకటలక్ష్మీ, పాకా సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement