బొమ్మల్లో భక్తి.. కొలువులో కనకధార | - | Sakshi
Sakshi News home page

బొమ్మల్లో భక్తి.. కొలువులో కనకధార

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

● సంప్రదాయానికి సజీవ రూపం ● ప్రతి బొమ్మలో ఒక పురాణ గాథ, ● ప్రతి మెట్టుపై ఒక ఆధ్యాత్మిక సందేశం

సీతంపేట: దసరా అంటే దేవీ నవరాత్రుల వైభవం.. అమ్మవారి అలంకారాలు.. భక్తి పారవశ్యం. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చేది బొమ్మల కొలువు. హిందూ సంప్రదాయం, పురాణాల విశిష్టత, భారతీయ సంస్కృతిని భావితరాలకు చేరవేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సంప్రదాయమిది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజూ ఒక్కో అలంకారంలో దర్శింపజేస్తూ, సాయంత్రం ముత్తైదువులకు పేరంటం నిర్వహించి తాంబూలాలు అందించడం ఈ సంప్రదాయంలోని మరో ప్రత్యేకత. నగరంలోని అక్కయ్యపాలెం లలితానగర్‌లో తొండం వినాయక ఆలయం సమీపంలో నివసిస్తున్న ఆర్‌. సత్యమాధురి లక్ష్మి ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 ఏళ్లుగా నిరంతరాయంగా నవరాత్రుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ వస్తున్న ఆమె, ఈ ఏడాది ‘కనకధారా స్తోత్రం’ అనే విశిష్టమైన ఆధ్యాత్మిక అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఆది శంకరాచార్యులు భిక్షాటనలో భాగంగా ఓ నిరుపేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లినప్పుడు, ఇవ్వడానికి ఏమీ లేక ఆ గృహిణి ఒక ఎండిన ఉసిరికాయను భిక్షగా సమర్పిస్తుంది. ఆమె భక్తికి చలించిన శంకరాచార్యులు అక్కడికక్కడే కనకధారా స్తోత్రం రచించి పారాయణం చేయగా, మహాలక్ష్మి ప్రసన్నురాలై బంగారు నాణాలు, బంగారు ఉసిరికాయలను ధారగా కురిపించి ఆ కుటుంబాన్ని ఐశ్వర్యవంతులను చేసిన గాథను ఈ కొలువులో ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కనకధారా స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందనే సందేశాన్ని ఈ థీమ్‌ ద్వారా చక్కగా ప్రతిబింబించారు.

ఈ కొలువులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి జననం నుంచి వారి జీవితంలోని ప్రధాన ఘట్టాలు, నవదుర్గలు, అష్ట వారాహులు, సప్తనాయికలు, అష్టలక్ష్ములు, తిరుమల బ్రహ్మోత్సవాలు, నవనరసింహులు, మేధా దక్షిణామూర్తి, పూరీ జగన్నాథుడు, అన్నపూర్ణాదేవి, బాలాత్రిపురసుందరి, అష్టవినాయకులు వంటి అనేక ఆధ్యాత్మిక దృశ్యాలు వందలాది బొమ్మల రూపంలో సజీవంగా కొలువుదీరాయి. ప్రతి మెట్టుపై ఒక పురాణ గాథ... ప్రతి బొమ్మలో ఒక దైవ సందేశం... ప్రతి దృశ్యంలో భారతీయ సంస్కృతి పరిమళం. భక్తిని పెంపొందించడమే కాకుండా చిన్నారులకు పురాణాలు, దేవతల వైభవం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై అవగాహన కల్పించే జీవంతమైన ఆధ్యాత్మిక పాఠశాలగా ఈ బొమ్మల కొలువు నిలుస్తోంది. భక్తులను, సందర్శకులను సమానంగా ఆకర్షిస్తూ నవరాత్రుల ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత గొప్పగా చాటుతోంది.

16 ఏళ్ళుగా బొమ్మల కొలువు

16 ఏళ్లుగా మా ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నా. మా అమ్మగారింట్లో, అలాగే అత్తగారింట్లో కూడా ఈ సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగుతోంది. కంచి, గయ, తిరుపతి, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు అక్కడి నుంచి కొన్ని బొమ్మలను సేకరించాను. ఇటీవల మరికొన్ని బొమ్మలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాను. మన హిందూ సంప్రదాయాలు, సంస్కృతి, పురాణాల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు వచ్చి సందర్శించవచ్చు.

– ఆర్‌. సత్యమాధురి లక్ష్మి, లలితానగర్‌, అక్కయ్యపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement