ఉదయం దూకుడు.. సాయంత్రం సైలెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉదయం దూకుడు.. సాయంత్రం సైలెంట్‌

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

చివరకు టీడీపీ ముందు సాగిలపడిన వైనం జీవీఎంసీ మేయర్‌ బరిలో నిలుస్తామంటూ హడావుడి టీడీపీ బేరసారాలతో వెనక్కి తగ్గిన జనసేన నాయకత్వం

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి గ్రేటర్‌ విశాఖ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కిరాకపోవడంతో జనసేన పార్టీ చివరి రోజు హడావుడి చేసింది. కూటమిలో సీట్ల పంపకంపై అసంతృప్తితో మేయర్‌ స్థానంతో పాటు ప్రధాన వార్డుల్లో స్వతంత్రంగా అభ్యర్థులను బరిలో దింపుతామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజు ఉదయం నుంచి విశాఖ రాజకీయాలు వేడెక్కాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్‌ను జనసేన తరఫున మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించను న్నట్లు సోషల్‌ మీడియా, పలు మీడియా గ్రూపుల్లో ప్రచారం సాగింది. అలాగే జీవీఎంసీలోని 80 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలబెడతారనే సమాచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. దీంతో జనసేన శ్రేణులు, మీడియా ప్రతినిధులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినా, కార్యాలయం వద్ద కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో టీడీపీ, జనసేన నాయకులే ఎక్కువగా కనిపించారు.

బరిలోకి రాకుండానే ముగిసిన ప్రయత్నం

కూటమి పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి స్వతంత్రంగా మేయర్‌ స్థానానికి పోటీ చేస్తామని జనసేన నేతలు ప్రకటించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. దీంతో టీడీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి జనసేన నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొన్ని కీలక స్థానాల కేటాయింపుపై హామీలు ఇవ్వడంతో చివరి నిమిషంలో జనసేన వెనక్కి తగ్గినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఉదయం వరకు మేయర్‌ పోటీపై హడావుడి చేసిన నేతలు సాయంత్రానికి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

కూటమి అంతర్గత విభేదాలపై చర్చ

సీట్ల సర్దుబాటులో ఒత్తిడి తెచ్చేందుకే జనసేన ఈ విధంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో దూకుడుగా వ్యవహరించిన పార్టీ చివరకు పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. జీవీఎంసీ ఎన్నికల వేళ కూటమిలోని అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

విశాఖలో జనసేన హైడ్రామా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement