అల్లిపురం: పాత్రికేయుల ఐక్యత, ఆత్మీయతకు ప్రతీకగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖలోని శ్రీకాంతి థియేటర్లో ఆదివారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో సమన్వయంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్య అతిథి, సీఎన్ఆర్ వెంచర్స్ అధినేత చెల్లుబోయిన నర్సింగరావు మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం చేయడంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు పాత్రికేయుల మధ్య ఐక్యతను, ఆత్మీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. నృత్యభారతి అకాడమీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండబాబు, ఎన్టీపీసీ డీజీఎం కుప్పిలి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, వై.రామకృష్ణ, ఎమ్మెస్సార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


